Breaking News

భారత నౌకాదళ భద్రత, సన్నద్ధతను పరిశీలించిన డెహ్రాడూన్ జర్నలిస్టుల బృందం

-పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారత నౌకాదళ భద్రత, సన్నద్ధతను పరిశీలించిన డెహ్రాడూన్ జర్నలిస్టుల బృందం
-స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ యుద్ధనౌకలోని అత్యాధునిక క్షిపణి, నిఘా సాంకేతికత గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు
-రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని చాటిచెబుతూ, సముద్ర తీర రక్షణలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధి ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా ప్రతినిధుల పర్యటన
-యుద్ధ సన్నద్ధతతో పాటు విపత్తు సాయం, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి సేవా కార్యక్రమాల్లో నౌకాదళం పోషిస్తున్న కీలక పాత్రను తెలిపిన అధికారులు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పత్రికా సమాచార కార్యాలయం (PIB) ఉత్తరాఖండ్‌ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం విశాఖపట్నంలో పర్యటించింది. ‘సన్‌రైజ్ కమాండ్’ అని పిలిచే ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో భారత సముద్ర భద్రత వ్యవస్థ, నౌకాదళ పనితీరును వారు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈస్టర్న్ ఫ్లీట్ (పూర్వీ బెడా) నౌక సందర్శన ద్వారా నౌకాదళ ఆధునిక సామర్థ్యాలు, వ్యూహాత్మక పాత్ర, స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో జరుగుతున్న పురోగతిపై మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఉదయగిరి సందర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత నౌకాదళ యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో దీనిని రూపొందించగా, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ‘ప్రాజెక్ట్ 17A’ కింద నిర్మించింది. ఇది తదుపరి తరం బహుళ-పాత్రల యుద్ధనౌకలకు మోడల్ గా నిలుస్తోంది. అత్యాధునిక స్టీల్త్ ఫీచర్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా పయనించే సామర్థ్యంతో తయారైన ఈ యుద్ధనౌక, సంక్లిష్టమైన సముద్ర ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా పనిచేయగలదు.

ఐఎన్ఎస్ ఉదయగిరిలో అధునాతన నిఘా, రాడార్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు, యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు ఉన్నాయి. ఆధునిక నావిగేషన్, నెట్‌వర్క్-సెంట్రిక్ వార్‌ఫేర్ టెక్నాలజీల సాయంతో నౌకాదళంలోని ఇతర వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పర్యటన సందర్బంగా కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ వికాస్ సూద్ నౌకపై జర్నలిస్టులకు స్వాగతం పలికి, నౌక పనితీరు, నౌకాదళ సంసిద్ధత గురించి వివరించారు.

టెక్నికల్ బ్రీఫింగ్ సమయంలో విశాఖపట్నం డిఫెన్స్ పీఆర్ఓ (PRO) కమాండర్ సుజిత్ రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రశాంత్ కుమార్‌తో కలిసి నౌకాదళ కార్యకలాపాలు, యుద్ధనౌకల పనితీరు, భారత సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో నౌకాదళం పాత్రను వివరించారు. ప్రిన్సిపల్ వార్‌ఫేర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమాండర్ అంబ్రీష్ యాదవ్ మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ ఉదయగిరి భారత స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనమని, ఇది భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను బలపరుస్తుందని చెప్పారు. యుద్ధ సన్నద్ధతతో పాటు మానవతా సాయం, విపత్తు సహాయక చర్యలు (HADR), సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు, సముద్ర భద్రతా కార్యక్రమాల్లోనూ ఈ నౌక పాల్పంచుకుంటోందని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, స్థిరత్వం కోసం నౌకాదళం ఒక బలమైన శక్తిగా పని చేస్తోందని మీడియా ప్రతినిధులకు వివరించారు.

జర్నలిస్టులు నౌకలోని ప్రధాన ప్రాంతాలైన బ్రిడ్జ్, ఆయుధాలు ఉండే ఫాక్సెల్ (Foxle) డెక్, హెలికాప్టర్ నిలిపే హ్యాంగర్, బోట్, టోర్పెడో ఫైరింగ్ డెక్‌లను సందర్శించారు. సముద్ర భద్రత సవాళ్లు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక బాధ్యతలు, ఆధునిక యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నౌకల ప్రాముఖ్యత గురించి అధికారులు మీడియా బృందానికి సమగ్రంగా వివరించారు.

భారత నౌకాదళ వృత్తి నైపుణ్యం, సాంకేతిక అధునాతనత, ఉన్నత ప్రమాణాలను మీడియా ప్రతినిధులు అభినందించారు. ఇటువంటి సందర్శనలు జాతీయ భద్రత, రక్షణ సన్నద్ధత, స్వదేశీ సాంకేతిక పురోగతిపై ఖచ్చితమైన, వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. భారత రక్షణ స్వయం సమృద్ధిని, బలపడుతున్న నౌకాదళ సామర్థ్యాలను చాటిచెప్పడానికి ఈ మీడియా పర్యటన ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఈస్టర్న్ నావల్ కమాండ్ కట్టుబడి ఉన్న తీరును ఈ పర్యటన తెలియజేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *