-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహ అవసరాల వినియోగం కోసం, అలాగే విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు మరియు అత్యవసర సేవలకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు గ్యాస్ సిలిండర్లు గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి ప్రతి రోజూ సాధారణ స్థాయిలో సరఫరా అవుతున్నాయని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు.
సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 11,000 నుంచి 11,500 వరకు రీఫిల్ బుకింగ్లు నమోదవుతూ ఉంటాయని, అయితే ప్రస్తుతం రోజువారీగా 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్లు నమోదవుతున్నాయని తెలిపారు. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే దాదాపు 90 నుంచి 95 శాతం వరకు పెరుగుదల నమోదైందన్నారు. సిలిండర్ల డెలివరీలు FIFO (First In First Out) విధానంలో కొనసాగుతున్నందున కొన్నిచోట్ల బుకింగ్ చేసిన తరువాత 2 నుంచి 3 రోజులలో డెలివరీలు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల అంతరాయం కారణంగా 2 నుంచి 3 రోజుల వరకు ఆలస్యం కనిపిస్తున్నదని వివరించారు.
అందువల్ల గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి అవసరానికి మించి బుకింగ్లు చేయకుండా, అవసరం మేరకే సిలిండర్లు బుక్ చేసుకోవాలని వినియోగదారులను కోరారు.
గ్యాస్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కంట్రోల్ రూమ్‌లో హెల్ప్‌లైన్ నెంబర్ 8074661259 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే వినియోగదారులు ఈ సేవను వినియోగించు కోవచ్చని సూచించారు. ఒకేసారి అధిక సంఖ్యలో రీఫిల్ బుకింగ్లు చేయడం వల్ల కొన్నిసార్లు కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అందువల్ల వినియోగదారులు ఆయిల్ కంపెనీలు ఇచ్చిన నంబర్లకు WhatsApp ద్వారా మెసేజ్ పంపడం, మిస్డ్ కాల్ ఇవ్వడం, అలాగే PhonePe, Google Pay, Paytm, Amazon Pay వంటి UPI యాప్‌ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.
ఏజెన్సీ వారీగా శనివారం నమోదైన బుకింగ్స్, డెలివరీలు మరియు గత 72 గంటలకు పైగా పెండింగ్‌లో ఉన్న వివరాలను పరిశీలిస్తే, … ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పరిధిలో శనివారం 3,355 బుకింగ్స్ నమోదు కాగా 2,100 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ప్రస్తుతం 7,232 సిలిండర్లు అందుబాటులో ఉండగా 72 గంటలకు పైగా పెండింగ్‌లో ఉన్న బుకింగ్స్ 1,544 ఉన్నాయి.
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPC) పరిధిలో శనివారం 15,278 బుకింగ్స్ నమోదు కాగా 10,134 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ప్రస్తుతం 8,077 సిలిండర్లు అందుబాటులో ఉండగా 72 గంటలకు పైగా పెండింగ్‌లో ఉన్న బుకింగ్స్ 18,306 ఉన్నాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC) పరిధిలో శనివారం 1,236 బుకింగ్స్ నమోదు కాగా 727 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ప్రస్తుతం 1,138 సిలిండర్లు అందుబాటులో ఉండగా 72 గంటలకు పైగా పెండింగ్‌లో ఉన్న బుకింగ్స్ 2,394 ఉన్నాయి.
శనివారం రోజున మూడు ఆయిల్ కంపెనీల ద్వారా మొత్తం 19,869 బుకింగ్స్ నమోదు కాగా 12,961 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ప్రస్తుతం మూడు సంస్థల వద్ద కలిపి 16,447 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 72 గంటలకు మించిన పెండింగ్ బుకింగ్స్ మొత్తం 22,244 ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెండింగ్ బుకింగ్స్ త్వరితగతిన క్లియర్ చేయడానికి ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు సరఫరా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News