అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ పండుగలలో అర్థం, పరమార్థం నిబిడీకృతమై ఉంటున్న సంగతి భారతీయులందరికీ విదితమే. ముఖ్యంగా కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలసిన విశిష్టత మన పండుగలలోనే గోచరిస్తుంది. అటువంటి వాటిలో మన తెలుగువారి తొలి పండుగ, ముఖ్యమైన పండుగ అయిన ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు ఆగమనంతోపాటు వచ్చే ఈ తొలి పండుగ తెలుగువారికి అతి ఇష్టమైన పండుగగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. మహారాష్ట్రలో ఈ పండుగను “గుడి పాడ్వా”గా, కర్ణాటకలో “యుగాది” గా, సింధీ సమాజంలో “చెటి చంద్”గా, కాశ్మీరీ పండితులు “నవ్రెహ్”గా, మణిపూర్‌లో “సజిబు నోంగ్మా పాన్‌బా”గా జరుపుకొంటారు. ఈ ఉగాది ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం పేరిట మన ముందుకు వస్తోంది. “పరాభవో న జ్ఞాతవ్యః” అంటే పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. పెద్దలు మాట పాటిస్తూ జాగ్రత్త వహించడమే మన విధి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది తెలుగు వారందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Prajavartha Online Telugu News