-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-కూటమి ప్రభుత్వం చొరవతో విదేశీ నిధుల రెన్యూవల్ పునరుద్ధరణ
-సేవా కార్యక్రమాలతో పేదలకు ఎంతో మేలు
-సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు
-వైసీపీకి క్రెడిట్ చోరీ అలవాటే…
-మీడియా పాయింట్ లో మంత్రి సవిత విసుర్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆర్డీటీ విదేశీ నిధుల రెన్యూవల్ కు సహకరించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, బంగారు శ్రావణితో కలిసి ఆమె మాట్లాడారు. 60 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద్బాంధవిలా నిలుస్తూ, సామాజిక సేవలు అందిస్తోందన్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు అనంతపురంలోని వెనుకబడిన ప్రాంతాలను చూసి చలించిపోయారన్నారు. ఆర్డీటీ సంస్థను స్జాపించి పేదలకు విద్య, వైద్య సేవలు అందించారన్నారు. ఇళ్లు లేని వేలాది మందికి గృహ సదుపాయం కల్పించారని, మరికొందరు పేదలకు వ్యవసాయం కోసం భూములిచ్చారని, ఆధునిక పనిముట్లు అందిస్తూ రైతులకు తోడుగా నిలిచారని కొనియాడారు. ముఖ్యంగా, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందజేశారని, ఎందరో అనంతపురం క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సందర్భాలున్నాయన్నారు. ఆర్డీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో ఎందరో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అత్యవసర చికిత్స కోసం బెంగళూరుకో, హైదరాబాద్‌కో వెళ్లాల్సిన అవసరం తప్పిందన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఈ ఆసుపత్రి ఓ వరమన్నారు. వేలాది మంది పేద బిడ్డలను చదివించి ఆ సంస్థ ప్రయోజకులను చేసిందని మంత్రి కొనియాడారు.
*మాటనిలబెట్టుకున్నాం*
ఆర్డీటీ నిధుల సమీకరణలో సాంకేతిక అంశాల కారణంగా విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ) నిలిచిపోయిందని మంత్రి సవిత తెలిపారు. ఇదే విషయమై తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్నారు. ప్రధాని నరేంద్రమోడి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను ఒప్పించి, ఆర్డీటీ సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ) పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తరచూ మాట్లాడుతూ, ఆర్డీటీ సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ కు అనుమతులు వచ్చేలా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహననాయుడు కూడా కృషి చేశారన్నారు. ఎనిమిది నెలల కిందట ఇదే వేదిక మీద ఆర్టీడీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించి తీరుతామని తెలిపామని గుర్తుచేశారు. చెప్పిన మాటకు కట్టుబడుతూ ఆర్టీడీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించామన్నారు.
వైసీపీదే క్రెడిట్ చోరీ
క్రెడిట్ చోరీకి పాల్పడడం వైసీపీకి అలవాటుగా మారిందని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. ఆర్డీటీ సేవలు నిలిపేసినా, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తరచూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, ఆర్టీడీ సేవలు పునరుద్ధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తమ వల్లే ఆర్డీటీ విదేశీ నిధుల రెన్యూవల్ ను పునరుద్ధరించారని వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి సవిత విమర్శించారు.
Prajavartha Online Telugu News