-దేశంలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఆవిష్కరణ
-45 లక్షల మందికి క్వాంటం, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
-క్వాంటం మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం
-ఔషధాల నుంచి క్రయోజెనిక్స్ వరకూ పరిశోధనలకు కేంద్రంగా క్వాంటం వ్యాలీ
-ఎస్ఆర్ఎం, మేధాటవర్స్‌లోని 1 ఎస్,1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన 1 ఎస్, 1 క్యూ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్ పాడ్గా మారుస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన అనంతరం క్వాంటం రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..”ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలీటీ, మేథాటవర్స్‌లో 1 క్యూ పేరిట మరో క్వాంటం సిస్టం ఏర్పాటు చేశారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను. క్వాంటం సైన్స్ వంద ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రపంచ క్వాంటం దినోత్సవం రోజున దీన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించాం. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించుకున్నాం. క్వాంటం టెక్నాలజీని పరిశోధకులకు, కంపెనీలకు, విద్యార్ధులకు అందుబాటులో ఉంచేలా ఈ టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేయటంపై అందరికీ అభినందనలు. భారత తొలి ఓపెన్-యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీలతో పాటు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తోన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఏక్వూవీ ని వేగంగా పూర్తి చేయటంలో సహకరిస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాండికర్కు ధన్యవాదాలు. అమరావతిలో ప్రారంభమైన 1ఎస్ ,1 క్యూ క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్ క్వాంటం ఉపకరణాలను పరీక్షించడానికి, సర్టిఫై చేయడానికి కీలకం. దేశంలోని తొలి క్వాంటం కంప్యూటర్లకు ఆంధ్రప్రదేశ్ వేదిక అయినందుకు గర్విస్తున్నాను. ఐటీ రంగంలో కీలక పాత్ర పోషించిన తెలుగు గడ్డ ఇప్పుడు క్వాంటం టెక్నాలజీకి వేదికగా మారటం సంతోషదాయకం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
క్వాంటం రంగంలో ఆత్మనిర్భర్‌గా ఆంధ్రప్రదేశ్
“పారిశ్రామిక రంగానికి విద్యుత్ కీలకం, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ అంతే ముఖ్యం, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ ప్రధానం. క్వాంటం సాంకేతికతలో సాధికారిత సాధించిన దేశాలే భవిష్యత్తును శాసించే అవకాశం ఉంటుంది. భారతీయ పరిశోధకులకు క్వాంటం హార్డ్‌వేర్ పరీక్షించేందుకు అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రధాన కేంద్రం అవుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని అమరావతి 1 ఎస్ కంప్యూటర్ పరిశోధనలకు, మేధా టవర్స్‌లోని అమరావతి 1క్యూ కంప్యూటర్ పారిశ్రామిక వినియోగానికి తోడ్పడతాయి. అమరావతిలో ఏర్పాటైన ఈ రెండూ టెస్ట్ ఫెసిలిటీలు క్వాంటం టెక్నాలజీలో దేశ సామర్ధ్యాన్ని పెంచాయి. కేవలం 8 నెలల్లోనే క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం కంప్యూటర్లను నిర్మించాలని నేను ఇచ్చిన సూచనల మేరకు ఇవి ఏర్పాటయ్యాయి. దేశానికి, ప్రపంచానికి కావాల్సిన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడే తయారు చేసేలా కార్యాచరణ చేపట్టాం. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పూణెలోని డీఆర్డీఓ సహా వివిధ సంస్థల భాగస్వామ్యంతో స్వదేశీ టెక్నాలజీతోనే ఈ క్వాంటం టెస్ట్ బెడ్లు సిద్ధమయ్యాయి. ఇక వ్యూహాత్మక టెక్నాలజీల్లో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. దేశీయంగానే క్వాంటం ఉపకరణాలు తయారు చేయటం ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కీలకమైన అంశం. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో రూపొందించుకున్న 10 సూత్రాల్లో డీప్ టెక్ కూడా ఓ కీలకమైన అంశం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు
డిసెంబరు నుంచి అమరావతి క్వాంటం వ్యాలీ
“కృష్ణా నదీ తీరంలో ప్రజా రాజధాని అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా కాలుష్యరహితంగా నెట్ జీరో కాన్సెప్టుతో నిర్మిస్తున్నాం. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది. తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్, విశాఖలో మెడ్ టెక్, అనంతపురంలో సెమీ కండక్టర్ ఉత్పత్తి కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నాం. డేటా సెంటర్ సహా, ఏఐ మౌలిక సదుపాయాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. 15 బిలియన్ యూఎస్ డాలర్లతో గూగుల్ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతోంది. ప్రతీ పౌరుడికీ ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. డిసెంబరు నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభం అవుతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్‌తో పాటు ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్ ను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహిస్తున్నాం. ఐఐటీ చెన్నై, ఐబీఎం, వైసర్ సంస్థల భాగస్వామ్యంతో 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, డేటా సెక్యూరిటీలో నిపుణులుగా తీర్చిదిద్దుతాం. సాంకేతికతను అనుసరించటం కాదు…ఆవిష్కరణల స్థాయికి ఏపి ఎదిగేలా చర్యలు చేపడుతున్నాం. కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తున్నాం. ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్, క్రయోజనిక్స్, ఫ్యాబ్రికేషన్, యాంప్లిఫైడ్ రీసెర్చ్ లాంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వస్తాయి. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది. క్లైమేట్ మోడలింగ్ లాంటి అంశాలను చేపట్టవచ్చని” ముఖ్యమంత్రి వెల్లడించారు.
తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ కలిగిన రాష్ట్రంగా ఏపీ
అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా నిర్మితమైన తొలి క్వాంటం టెస్ట్ బెడ్స్ తో ఆంధ్రప్రదేశ్ ఈ టెస్ట్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా మారింది. ఈ రెండు క్వాంటం టెస్ట్ ఫెసిలిటీల ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి సర్టిఫై చేసేందుకు అవకాశం ఏర్పడినట్టైంది. తద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్ధ్యాన్ని అమరావతి క్వాంటం వ్యాలీ అందిపుచ్చుకుంది. మైనస్ 273 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య క్వాంటం హార్డ్ వేర్, సెమీ కండక్టర్లను పరీక్షించేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు, ఉపకరణాలు తయారు చేసే వివిధ సంస్థలు, పరిశోధకులు, విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ఎస్ఆర్ఎం వర్సిటీలోని 1 ఎస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటి ఓపెన్ యాక్సెస్ గా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, వర్చువల్ గా ప్రధాని సాంకేతిక సలహదారు అజయ్ సూద్, డీఆర్డీఓ డీజీ ఆర్వీ ప్రసాద్,క్యూబిట్ ఫోర్స్ ఫౌండర్ వెంకట సుబ్రమణియన్, ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ్, వీసీ ప్రోఫెసర్ సతీష్ కుమార్, ఐఐటీ చెన్నై, తిరుపతి ప్రోఫెసర్లు కామకోటి, సత్యనారాయణ ఏపీ స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News