-మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది
-పవిత్ర హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
-పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ, జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం నుండి ఈ రోజు హజ్ యాత్రకు బయల్దేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులను కలుసుకుని, గన్నవరం ఎస్.ఎం.కన్వెన్షన్లో మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి.ఫరూఖ్, ఎమ్మెల్యే నజీర్, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ , నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్తో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ, జీవితంలో ఒక్కసారి అయినా మక్కా వెళ్లాలని కోరుకుంటారు. అలాంటి హజ్ యాత్రను రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించడంతో పాటుగా, అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి మైనార్టీ సోదరుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1987 మంది వెళ్తుండగా, విజయవాడ పరిసర ప్రాంతాల నుండి 353 మంది యాత్రకు వెళ్తుండడం హర్షణీయం. మైనార్టీల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ఇమాం, మౌజంలకు ఆర్ధిక సాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్ధిక సాయం కూడా అందించబోతున్నాం. అమరావతిలో హజ్ భవనం నిర్మాణం చేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా.. ఎన్ని అవాంతారాలు ఎదురైనా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న మంచికి ప్రజల సహకారం కూడా అవసరమని, రాష్ట్ర అభివృద్ధికి అల్లా కృప తోడుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News