Breaking News

టెన్త్ లోనూ బీసీ బిడ్డల హవా

* ఏంజేపీలో 96.02 శాతంతో ఉత్తీర్ణత
* రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే 10 శాతం అధికం
* విద్యార్థుల సంఖ్యాపరంగా ఎంజేపీదే ఉత్తీర్ణతా శాతం టాప్
* 100 బీసీ గురుకులాల్లో 32 గురుకులాల్లో నూరు శాతం ఫలితాలు
* గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణతా శాతం
* ఇంటర్ లోనూ సత్తాచాటిన బీసీ విద్యార్థులు
* బీసీ హాస్టళ్లలోనూ అదే జోరు… 85.99 శాతం ఉత్తీర్ణత
* బీసీ బిడ్దల అత్యుత్తమ ఫలితాల సాధనపై మంత్రి సవిత హర్షం
* సత్ఫలితాలిచ్చిన మంత్రి లోకేశ్ వంద రోజుల ప్రణాళికలు
* కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే ఈ అత్యుత్తమ ఫలితాలు : మంత్రి సవిత
* అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబరాలు
* కార్యదర్శి సత్యనారాయణను, ఎంజేపీ కార్యదర్శి మాధవీలతను అభినందించిన మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి ఫలితాల్లోనూ మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు(ఎంజేపీ) విద్యార్థులు సత్తాచాటారు. 96.02 శాతం సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ప్రభుత్వ పరిధిలో నడిచే విద్య సంస్థలు, గురుకులాల్లో ఎంజేపీ గురుకులాలు ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు వంద బీసీ గురుకుల విద్యా సంస్థలు హాజరుకాగా, 32 గురుకులాల్లో వంద శాతం మేర ఫలితాలు రావడం విశేషం. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ గురుకులాలు 10 శాతం కంటే అధికంగా ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై, ఏప్రిల్ రెండో తేదీన ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం విడుదల చేశారు. 6,18,131 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, 85.25 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మహత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు టెన్త్ లోనూ సత్తాచాటారు. ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇంటర్ లో 97 శాతం, సెకండ్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ బిడ్డలు ఉత్తీర్ణుత శాతం సాధించి భేష్ అనిపించుకున్నారు. టెన్త్ లోనూ అదే స్థాయిలో ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంద ఎంజేపీ స్కూళ్లకు చెందిన 5,433 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 96.02 శాతం మేర ఉత్తీర్ణతా శాతంతో ఉత్తీర్ణులయ్యారు.

విద్యార్థుల సంఖ్యాపరంగా టాప్ ప్లేస్ ఎంజేపీదే…

గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం ప్రకారం 96.02 శాతంతో ద్వితీయ స్జానంలో ఎంజేపీ గురుకుల విద్యార్థులు నిలిచారు. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఎంజేపీ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. వంద బీసీ గురుకులాలకు చెందిన 5,501 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 96.02 శాతంతో 5,274 మంది మేర ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కు చెందిన విద్యార్థులు 96.04 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే 0.02 శాతంతో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు ముందంజలో నిలిచారు. టెన్త్ పరీక్షలకు 50 ఏపీ రెసిడెన్షియల్ కు చెందిన విద్యార్థులు 3,135 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఆ లెక్కన చూస్తే, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ విద్యార్థులే టాప్ లో నిలిచినట్లు.

గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత

గతేడాది కంటే ఎంజేపీ స్కూళ్లలో టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 95 శాతం మేర ఎంజేపీ విద్యార్థులు ఫలితాలు సాధించారు. ఈ ఏడాది 96.02 శాతంతో ఎంజేపీ విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది కంటే 1.02 శాతం మేర ఫలితాలు అధికంగా రావడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో 5,355 మంది పరీక్షలు రాయగా, ఈ ఏడాది 5,501 మంది పదో తరగతిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు వంద ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాయగా, 32 గురుకులాలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో పాసయ్యారు. ఎంజేపీ గురుకులాల్లో నంద్యాల జిల్లా నరవాడకు చెందిన విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఆ పాఠశాలకు చెందిన శ్రీసాయి 596 మార్కులతో ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచారు. రీటా సాహితి 593 మార్కులు, యశస్విని 589 మార్కులు సాధించి రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

మొన్న ఇంటర్ లో… నేడు టెన్త్ లో…

ఈ నెల 15న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ ఎంజేపీ విద్యార్థులు సత్తా చాటిన విషయం విదితమే. జూనియర్ ఇంటర్ లో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. నేడు విడుదలైన టెన్త్ పరీక్షల్లోనూ 96.02 శాతం బీసీ బిడ్డలు ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించుకున్నారు. టెన్త్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 85.25 శాతం కాగా, ఎంజేపీ ఉత్తీర్ణతా శాతం 96.02 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే 10 శాతానికి పైగా సాధించడం విశేషం. జూనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 77 శాతం రాగా, ఎంజేపీలో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి ఫలితాలు 81 శాతం రాగా, ఎంజేపీ విద్యార్థులు 94 శాతంతో సత్తా చాటారు. ప్రభుత్వ పరిధిలో నడిచే అన్ని విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాలు జూనియర్ ఇంటర్ లో ప్రథమ స్థానంలో, సీనియర్ ఇంటర్ లో రెండో స్థానం నిలవడం గుర్తించుకోదగ్గ విషయం.

బీసీ హాస్టళ్లలోనూ అదే జోరు…

ఎంజేపీ గురుకులాలతో పాటు బీసీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులూ పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల నుంచి 8,466 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, 7,280 మంది ఉత్తీర్ణత సాధించారు. 85.99 శాతం మేర బీసీ హాస్టళ్ల విద్యార్థులు ప్రతిభ చాటారు. వారిలో 5,187 మంది ఫస్ట్ క్లాస్ లో, 1,437 మంది సెకండ్ క్లాస్, 652 మంది థర్డ్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు. 1,001 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారు. బీసీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు గతేడాది 77.22 శాతంతో ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 8.78 శాతం అధికంగా 85.99 శాతంతో పాసవ్వడం విశేషం. అనకాపల్లి జిల్లా రావికమతం జెడ్పీ హై స్కూల్ విద్యనభ్యసిస్తున్న బీసీ హాస్టల్ విద్యార్థిని కె.మానస మ్యాథ్స్ లో వందకు వంద మార్కులు సాధించడం విశేషం.

అమరావతిలో సంబరాలు

టెన్త్ పరీక్షల్లో ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 96.02 శాతంతో ఉత్తీర్ణత సాధించడంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితను ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత మర్యాదపూర్వకంగా కలిశారు. గతేడాది కంటే అత్యధిక ఫలితాలు సాధించినందుకు కార్యదర్శి సత్యనారాయణకు, మాధవీలతకు స్వీట్లు అందజేసి, మంత్రి అభినందించారు.

సత్ఫలితాలిచ్చిన వంద రోజుల ప్రణాళికలు : మంత్రి సవిత

టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులు, బీసీ హాస్టళ్ల విద్యార్థులు సత్తా చాటడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీలో 96.02 శాతంతో, బీసీ హాస్టళ్లలో 85.99 శాతంతో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంత్రి లోకేశ్ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలు సత్ఫలితాలిచ్చాయన్నారు. బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంకల్పమన్నారు. విద్యతోనే అత్యున్నత స్థానాలు సాధ్యమని నమ్మి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి రెండేళ్లలో పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కొనియాడారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు బీసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *