రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదివారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయానికి చేరుకోగా, ఆయనకు రాజమహేంద్రవరం ఇంచార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. ఆనందరావు , జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ అతిథి గృహం (మంజీరా)కు చేరుకుని రాత్రి బస చేశారు. సోమవారం మే 4 వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమహేంద్రవరం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ప్రజా ప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థలు అధికారులు , సాధారణ ప్రజలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు, వినతిపత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించనున్నారు.
పర్యటనలో భాగంగా జిల్లాలో బీసీ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమగ్ర సమీక్ష నిర్వహించ నున్నారు. ఈ నేపథ్యంలో విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, హౌసింగ్, సామాజిక భద్రత తదితర అంశాలపై అమలవుతున్న పథకాల పురోగతి, లబ్ధిదారుల వివరాలు, ఖర్చులు, సాధించిన ఫలితాలను సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్‌కు సమర్పించాలన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News