వైద్య ప‌రిక‌రాల కొనుగోలు అక్ర‌మాల‌పై నివేదిక కోరిన మంత్రి

-ఆరోప‌ణ‌ల‌కు చోటులేకుండా స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌ల‌కు ఆదేశం
-వైద్య సిబ్బంది స‌ర్వీసు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి
-రానున్న సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ స‌జావుగా సాగాలి
-ఆదేశాలు జారీ చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు మీడియాలో వ‌స్తున్న వార్తా క‌థ‌నాల‌పై వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మ‌గ్ర నివేదిక‌ను కోరారు. ఈ విష‌యంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ‌కు సంబంధించిన ప‌లు ఇత‌ర విష‌యాల‌పై మంత్రి శ‌నివారంనాడు కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ కు లిఖిత‌పూర్వ‌క ఆదేశాలు జారీ చేశారు.

నివేదించాల్సిన అంశాలు

ఎక్కువ ధ‌ర‌ల‌కు వైద్య ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు, అవ‌స‌రంలేని వాటిని కొంటున్న‌ట్లు, కొంత‌మంది స‌ర‌ఫ‌రాదారుల‌కు అనుగుణంగా ఉండేలా సాంకేతిక ప్ర‌మాణాలు రూపొందిస్తున్న‌ట్లు, గ‌తంలో స‌ర‌ఫ‌రా చేసేందుకు అన‌ర్హులుగా నిర్ణ‌యించిన వారికి తిరిగి అవ‌కాశాలు ఇస్తున్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స‌మ‌గ్రంగా నివేదిక‌ను అతి త్వ‌ర‌లో స‌మ‌ర్పించాల‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ శాఖ కార్య‌ద‌ర్శిని ఆదేశించారు.

ఎటువంటి ఆరోప‌ణ‌ల‌కు తావులేకుండా…నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మాత్ర‌మే పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన వాతావ‌ర‌ణంలో వైద్య ప‌రిక‌రాల కొనుగోలు జ‌రుగుతుంద‌న్న విశ్వాసాన్ని స‌ర‌ఫ‌రాదారుల‌లో క‌లిగించాల్సిన అవ‌స‌రాన్ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ దిశ‌గా స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ ప్ర‌క్రియను సూచించాల‌ని మంత్రి ఆదేశించారు.

అంతా అధికారుల చేత‌ల్లోనే…

వైద్య ప‌రిక‌రాల కొనుగోలుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తయారుచేయడం, ఆయా ప‌రిక‌రాల‌కు సంబంధించిన సాంకేతిక ప్ర‌మాణాల్ని రూపొందించ‌డం, త‌గు నిబంధ‌న‌ల్ని రూపొందించి టెండ‌ర్ల‌ను పిల‌వ‌డం, వాటిపై తుది నిర్ణ‌యాల్ని తీసుకోవ‌డం ఆయా అధికారులే నిర్ణ‌యిస్తార‌ని, దీనిని లోప‌భూయిష్టంగా చేసేందుకు త‌గు సూచ‌న‌లు చేయాల‌ని కూడా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కార్య‌ద‌ర్శిని ఆదేశించారు.

మంత్రికి ఈడీ వివ‌ర‌ణ‌

మీడియాలో వ‌చ్చిన వార్తా క‌థ‌నాల నేప‌థ్యంలో ఎపిఎంఎస్ఐడిసి (APMSIDC) ఎక్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్ శ‌నివారం ఉద‌యం మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ను క‌లిసి తన పాత్ర‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. ఆయా వైద్య ప‌రిక‌రాల కొనుగోలుకు సంబంధించిన సాంకేతిక ప్రమాణాల‌(టెక్నిక‌ల్ స్పెసిఫికేష‌న్) నిర్ధార‌ణ‌లో త‌నకు ఎట్టి పాత్ర లేద‌ని, కేవ‌లం రెండు సంద‌ర్భాల్లోనే తాను సాంకేతిక ప్ర‌మాణాల‌ను పునః ప‌రిశీలించాల‌ని సూచించాన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. దంత వైద్యులు వాడే పేషెంట్ కుర్చీల‌కు సంబంధించి ఒక కంపెనీ పేరుతో వారి ప్ర‌మాణాల‌ను వైద్యులు సూచించ‌గా, అది నిబంధ‌న‌ల‌కు విరుద్ధం క‌నుక పునః ప‌రిశీలించాలంటూ సూచించాన‌ని ఈడీ వివ‌రించారు. 16 స్లైస్‌(Slice) తో కూడిన సిటి స్కాన్ కొనుగోలుకు వైద్యులు సూచించ‌గా, అట్టి ప‌రిక‌రాల కొనుగోలు, స‌ర‌ఫ‌రా త‌గ్గిన నేప‌థ్యంలో పునః ప‌రిశీలించాలని మాత్ర‌మే సూచించాన‌ని ఆయ‌న మంత్రికి తెలిపారు. తానెటువంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు.

ఇత‌ర అంశాలు

2026 సంవ‌త్స‌రానికి సంబంధించి సాధారణ బ‌దిలీలు చేప‌ట్టే అవ‌కాశ‌మున్నందున, గ‌త సంవ‌త్స‌రం అనుభ‌వాల నేప‌థ్యంలో ఈసారి చేప‌ట్టే ప్ర‌క్రియ మ‌రింత ప‌టిష్టంగా జ‌ర‌గ‌డ‌డానికి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ శాఖ కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌కు బ‌దిలీల నుండి మిన‌హాయింపులిచ్చే అంశాన్ని లోతుగా ప‌రిశీలించి త‌గు సూచ‌న‌లు చేయాల‌ని, స‌మ‌ర్ధ‌వంత‌మైన ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ ద్వారా త‌క్కువ వ్య‌వ‌ధిలో లోప‌ర‌హిత‌మైన బ‌దిలీలు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు.

త‌మ స‌ర్వీసు విష‌యాలు, స‌మ‌స్య‌ల‌కు సంబంధించి పలువురు వైద్యులు, సిబ్బంది సంఘాలు ఇచ్చిన విన‌తులు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, వీట‌న్నింటినీ ప‌రిశీలించి సాధ్యాసాధ్యాల‌పై విస్తృత చ‌ర్చ‌ల కోసం వెంట‌నే ఒక నివేదికను స‌మ‌ర్పించాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ ను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *