అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన (Capital Investment and Infrastructure Projects) మూలధన పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు లక్ష్యాలను సాధించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు అధికారులను ఆదేశించారు. శనివారం రాజధాని గ్రామాలైన మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, రాయపూడి ప్రాంతాలలో జరుగుతున్న సిప్ అభివృద్ధి పనులను పరిశీలించారు.
రాజధాని గ్రామాలలో నివశిస్తున్ ప్రజలకు మంచినీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, వర్షపు నీరు – మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల కల్పనలకు ఇంజినీరింగ్ అధికారులు సముచిత స్థానం కల్పించాలన్నారు.
మల్కాపురం గ్రామంలో జరుగుతున్న చెరువు సుందరీకరణతో పాటు ఇక్కడ జరుగుతున్న వాటర్, డ్రయినేజీ వంటి నిర్మాణాలను పరిశీలించి సకాలంలో వీటిని పూర్తిచేయాలని సీఎండీ వారు ఆదేశించారు.
మందడంలో అభివృద్ధి పనులు జరుగుతుండగా ప్రధాన రహదారిపై జరుగుతున్న వాటర్ పైపులైన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర సచివాలయానికి ప్రధాన మార్గం కావటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఛీఫ్ ఇంజినీరు సీహెచ్.ధనుంజయకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణాయపాలెంలో గ్రామ అభివృద్ధి పనులు చేస్తుండగా ప్రధాన కూడలి వద్ద జరుగుతన్న హైమాస్ట్ దీపాల ఏర్పాటు పనులను పరిశీలించి మరో 10 రోజులలో వీటిని అందుబాటులోనికి తీసుకురావాలని సూపరింటెండింగ్ ఇంజినీరు ఆర్.హనుమంతరెడ్డిని ఆదేశించారు. అనంతరం ఎర్రబాలెంలో, రాయపూడి గ్రామంలో జరుగుతున్న సిప్ అభివృద్ధి పనులను పర్యవేక్షించి ఇంజినీరింగ్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రాజధాని గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా పనులు చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News