– నడిచే దారి బాగుంటే వచ్చే భవిత బంగారమే
– ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేద్దాం
– స్వచ్ఛ పథం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం స్వచ్ఛ రథాన్ని అమలు చేస్తోందని.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. విస్తృత ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ.. జెడ్‌పీ సీఈవో డా. జె.అరుణతో కలిసి విజయవాడ గ్రామీణం, పాతపాడు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక థీమ్‌తో ప్రతి శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల రహదారులు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలనే సంకల్పంతో స్వచ్ఛ పథం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గ్రామాల్లో రహదారుల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఘనవ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఇందులో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని.. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటిదగ్గరికి వచ్చే సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. కార్యక్రమంలో డీపీవో పి.లావణ్యకుమారి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News