-సంజీవని సహా వివిధ ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న సీఎం
-యాదమరి ఆరోగ్య కేంద్రం నుంచి నిపుణులు, వైద్యులతో వర్చువల్ గా మాట్లాడిన సీఎం
-గ్రామస్థాయికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
పూతలపట్టు/చిత్తూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. సంజీవని కార్యక్రమంలో పాల్గొనడానికి పూతలపట్టు వచ్చిన సీఎం చంద్రబాబు… తన పర్యటనలో భాగంగా పీహెచ్‌సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును ల్యాబ్ డెమోల ద్వారా పరిశీలించారు. ఓ పెషంట్ పీహెచ్సీకి వచ్చి… వైద్యం చేయించుకుని మందులు తీసుకెళ్లే ప్రక్రియను మొత్తం ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి ఎలాంటి వైద్యం అందిస్తున్నారోననే అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించి.. అక్కడున్న సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా సంజీవని ద్వారా రోగులకు తాము ఎలాంటి సేవలను అందిస్తున్నామనే అంశాన్ని ముఖ్యమంత్రికి ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది వివరించారు.
ఓపీ నుంచి ఫార్మసీ వరకు ప్రతి విభాగాన్ని పరిశీలించిన సీఎం
ఓ పేషెంట్ పీహెచ్సీకి వస్తే పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ డెస్క్ వద్ద చేపట్టే నమోదు ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. పీసీసీ డెస్క్ ప్రతినిధి ఈ డిజిటల్ విధానాన్ని సీఎంకు వివరించారు. డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్, విజిట్ రికార్డుల జనరేషన్, రోగుల సేవలను మ్యాపింగ్ చేసే విధానాన్ని సీఎంకు వివరించారు. పీహెచ్‌సీ డ్యాష్ బోర్డులో ఉన్న మొత్తం రిజిస్ట్రేషన్లు, రోజువారీ కన్సల్టేషన్లు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ట్రాకింగ్ వంటి వాటిని సీఎం పరిశీలించి… వాటి పర్యవేక్షణ తీరుపై అధికారులతో చర్చించారు. ఆ తర్వాత స్టాఫ్ నర్స్ స్టేషన్ ను సీఎం సందర్శించారు. బీపీ, ఎత్తు, బరువు, టెంపరేచర్, హార్ట్ బీట్, పల్స్ రేట్ వంటి వివరాలను డిజిటల్ పద్దతిలో నమోదు చేస్తున్న ప్రక్రియను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత సంజీవని ప్లాట్‌ఫామ్ లో ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని సీఎం చంద్రబాబు వీక్షించారు. అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ రోగి పాత చరిత్రను సేకరించడం, నర్సులు రికార్డు చేసిన వైటల్స్‌ను తనిఖీ చేయడం, ఏఐ సపోర్ట్, ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ జనరేషన్ వంటి ప్రక్రియలను లైవ్‌లో ముఖ్యమంత్రికి చూపించారు. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల డాక్యుమెంటేషన్ భారం తగ్గి, రోగులపై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు వీలవుతుందని చంద్రబాబుకు డాక్టర్ వివరించారు. ఆ తర్వాత ఫార్మసీ విభాగాన్ని సీఎం సందర్శించారు. ఫార్మసీలో డిజిటల్ ప్రిస్క్రిప్షన్లను చూసి మందుల పంపిణీ చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా ఫార్మసీ విధుల్లో భాగంగా తాము రోజు వారీ చేసే పని విధానాన్ని సీఎంకు ఫార్మసీ సిబ్బంది వివరించారు. ఇక పీహెచ్‌సీలోని వర్చువల్ రూమ్ నుంచి సంజీవని ప్లాట్‌ఫామ్ ద్వారా కనెక్ట్ అయి… కుప్పం ఏరియా హాస్పిటల్, బెంగళూరులోని టాటాఎండీకి నిపుణులైన వైద్యులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంత రోగులకు సుదూర ప్రయాణాల భారం తప్పిస్తూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా అత్యాధునిక వైద్య నిపుణుల సేవలను నేరుగా స్థానిక పీహెచ్‌సీలకే చేరవేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. అత్యాధునిక సాంకేతికత విధానం గ్రామీణ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఈ సందర్భంగా సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో వైద్యం తీసుకుంటున్న పలువురు పేషంట్లు.. వారి బంధువులతో సీఎం సంభాషించారు. టెక్నాలజీని అనుసంధానించి అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు ఎలా ఉందని వారి నుంచి సీఎం చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తమకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలు తమకు అందుతున్నాయని.. పథకాల అమలు బాగుందని వారు సీఎంకు వివరించారు. అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించగలుగుతున్నామని లబ్దిదారులు సీఎంకు చెప్పారు.
Prajavartha Online Telugu News