Breaking News

రూ.6వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాం

-ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కూటమి కట్టుబడి ఉంది
-విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది
-గత రెండు సంవత్సరాలుగా ఒక్కరూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు
-విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశాం
-వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు త్వరితగతిన స్పందించాలి

ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త :
రూ. 6 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కలిసి ప్రారంభించారు. ముందుగా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.20.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ – విలేజ్ హెల్త్ క్లినిక్‌ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం గడువు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రారంభించారు. నౌడూరు సెంటర్ నుంచి బ్రహ్మణ చెరువు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. నెగ్గిపూడి గ్రామంలోని ఎస్సీ/ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. తదనంతరం పెనుగొండ మండలంలోని 132/33 కెవి సబ్‌స్టేషన్‌లో నూతన 50 ఎంవిఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. అదేవిధంగా వడలి నుంచి జాతీయ రహదారి-16 వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన డబ్ల్యూబీఎం రహదారిని కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై అదనపు భారం పడకుండా చూసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు త్వరితగతిన స్పందించాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. గృహ, వాణిజ్య అవసరాల దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో మరిన్ని సబ్ స్టేషన్లు అవసరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.

ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ వర్గాలకు సబ్సిడీతో పాటు అదనంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. మిగతా వర్గాల వారికి కూడా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. నియోజకవర్గంలో అవసరమైన కండెన్సర్ల మంజూరుకు ఇప్పటికే ఇంధన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *