Breaking News

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
-వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విపత్తు నిర్వహణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (NDMEWS) జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున శనివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్ని శాఖాధిపతులు, జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నగరంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, కల్వర్టులు, అవుట్‌ఫాల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని, ఎక్కడైనా అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించాలని సూచించారు.

నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అవసరమైతే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య సేవలు, ఆహారం తదితర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఎస్టేట్ మరియు సంబంధిత అధికారులకు సూచించారు.

పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కొండ ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాలు, వాగులు మరియు కాలువల పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

నగరంలో భారీ వృక్షాలు కూలిపోకుండా ముందస్తుగా ప్రమాదకర కొమ్మలను తొలగించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్)ను ఆదేశించారు. అలాగే ఎక్కడైనా వృక్షాలు నేలకొరిగిన పక్షంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

పట్టణ ప్రణాళిక శాఖ అధికారులు నగరంలోని హోర్డింగులు, ప్రకటన బోర్డులు, యూనిపోల్స్ తదితర నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. స్థిరత్వం లేని, అనుమతులు లేని లేదా ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

అదనపు కమిషనర్ (జనరల్) నగర ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.

అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) వర్షాకాల సన్నద్ధత చర్యలు, డ్రెయిన్ల డీ-సిల్టింగ్ పనులు, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి నివేదికలు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు.

జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ముంపు సమస్యలు తలెత్తే ప్రాంతాలు, ప్రమాదకర నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. శాఖాధిపతులు అందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.

వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవాడ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *