విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో కమ్యూనిజం చచ్చిపోయింది అని దుందుడుకు వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది’ అని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాజకీయాల్లో నిర్దిష్టమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా, కేవలం అధికారమే పరమావధిగా భావించి ఒకవైపు కుల రాజకీయాలను, మరవైపు మతోన్మాద రాజకీయాలను , ఇంకోవైపు సనాతన రాజకీయాలను పెంచి పోషిస్తూ కుర్చీ కోసం వెంపర్లాడే పవన్ కళ్యాణ్ కమ్యూనిజం గురించి అవాకులు చవాకులు, పేలడం తగదు. వందేళ్ళ చరిత్ర కలిగిన కమ్యూనిజం చచ్చిపోయిందనే పవన్ కళ్యాణ్ వంటి ఊసరవెల్లి రాజకీయాలలో ఉండటం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చేగువేరా అలాంటి మహనీయులతో తనని పోల్చుకున్న పవన్ కళ్యాణ్ కు కనీసం ఆ మహనీయుల చరిత్ర, పోరాటం, త్యాగాల గురించి తెలుసునా అని ప్రశ్నిస్తున్నాం. నిజంగా ఆ మహనీయుల త్యాగాలు తెలిసి ఉంటే కమ్యూనిజం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండే వారు కాదు. కేవలం అధికారం కోసం పాకులాడే పవన్ కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిజం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆయన కమ్యూనిజాన్ని అవగాహన చేస్తూ మాట్లాడటం దుర్మార్గం. ఆర్ఎస్ఎస్, బిజెపి, అమిత్ షా ఎజెండాలను మోస్తున్న పవన్ కళ్యాణ్ చెబితే ఈ దేశం నుండి, ఈ ప్రపంచంలో నుండి తుడిచిపెట్టుకుపోయే దుస్థితిలో కమ్యూనిజం లేదని తెలియజేస్తున్నాం.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పై చేసిన విశ్లేషణ తప్పైతే తప్పని చెప్పాలి లేదంటే ఖండించాలి గాని, అలాకాకుండా రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని పెంచి పోషించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు. రాజకీయ విమర్శలకు రాజకీయంగా సమాధానాలు ఇవ్వాలే గాని ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు పాల్పడాలన్న ఆలోచన అత్యంత హేయమైనది. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్లో కమ్యూనిజం గురించి వ్యాఖ్యలు చేసినట్లు గోచరిస్తున్నది. ఎంతో చారిత్రక నేపథ్యంతో, ఎందరో మహనీయుల త్యాగనిరతితో, పేదల పక్షపాతిగా విరాజిల్లుతున్న కమ్యూనిజం గురించి వ్యాఖ్యానించే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు. కమ్యూనిస్టుల గురించి కమ్యూనిజం గురించి గతంలో పరుష వ్యాఖ్యలు చేసిన చాలామంది కాలగర్భంలో కలిసిపోయారనే సత్యాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలన్నారు.
Prajavartha Online Telugu News