Breaking News

విదేశీ పెట్టుబడి దారుడికి తప్పని వేధింపులు…

-ఏపీఎంఎంఎస్ డైరెక్టర్ సంగ్ హన్ కిమ్, ఆవేదన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం పెనుకొండ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామిని కావాలనే ఆకాంక్షతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను నమ్మి పెట్టుబడి పెట్టిన తనకు ప్రస్తుతం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఏపీఎంఎంఎస్ (ఏపీ ఎంఎంఎస్) ఎంటర్‌ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంగ్ హన్ కిమ్, ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ. కియా మోటార్స్ అనుబంధ పారిశ్రామిక వ్యవస్థను చూసి పెనుకొండలో ఈ సంస్థను స్థాపించామని ప్రస్తుతం సుమారు 200 భారతీయ కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఏడాదికి రూ. 40 కోట్ల టర్నోవర్‌తో కంపెనీ నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.
నమ్మించి మోసం చేశారు…
భారతీయ చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంతో కంపెనీ చట్టపరమైన వ్యవహారాల బాధ్యతను తన సీనియర్ మేనేజ్‌మెంట్ బృందానికి అప్పగించానని కిమ్, తెలిపారు. అయితే కంపెనీలో సామాగ్రి దొంగతనం జరగడంతో నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని ఆయన వెల్లడించారు. కంపెనీ నిధుల దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు, వనరుల మళ్లింపు వంటి చర్యల వల్ల సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని, ఈ విషయాలు బయటపడగానే సంబంధిత ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారని ఆయన వివరించారు.
రాజీనామా చేసిన వారి నుంచే వేధింపులు…
గతంలో కంపెనీకి అవసరమైన చట్టపరమైన అనుమతులు పొందే బాధ్యతను నిర్వర్తించిన వారే, ఇప్పుడు బయటకు వెళ్లి కంపెనీపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని కిమ్, మండిపడ్డారు. తాము పొందడంలో విఫలమైన అనుమతులనే సాకుగా చూపిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు చేస్తూ, కంపెనీ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై అచంచల విశ్వాసం ఈ సమస్యల వలయంతో తీవ్ర నిరాశకు లోనైనప్పటికీ, భారత న్యాయ వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సంగ్ హన్ కిమ్ స్పష్టం చేశారు. కొద్దిమంది స్వార్థపూరిత వ్యక్తుల చర్యల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడుల ప్రోత్సాహక ప్రయత్నాలు విఫలం కాకూడదని ఆయన కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాన్ని వెలికితీయాలని, తద్వారా భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో న్యాయ సలహాదారులు వెంకట సుబ్బరాయుడు, రామానుజరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *