జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు చొరవతో పెద్దవాగు వరదలో చిక్కుకున్న 22 మంది కూలీలు సురక్షితం

-కూలీలను రక్షించిన ఎన్డిఆర్ఎఫ్ రెవిన్యూ, పోలీస్, సిబ్బంది
-కూలీలు సురక్షితంగా వచ్చే వరకు సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
-జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ కు, ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కు కృతఙ్ఞతలు తెలియజేసిన కూలీలు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త:
బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం, కనకపురం గ్రామాలకు చెందిన 22 మంది కూలీలు పామాయిల్ తోటలలో పనులు ముగించుకుని జీలుగుమిల్లి రౌతుగూడెం వంతెన వద్ద వచ్చేసరికి పెద్దవాగు వరద ఉధృతికి వంతెన రోడ్డు కొట్టుకుపోవడంతో కూలీలు వంతెనపై వరద నీటిలో చిక్కుకుపోయారు. పరిస్థితిని ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తక్షణమే సహాయక చర్యలతో కూలీలను రక్షించేందుకు చర్యలను తీసుకున్నారు. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో తో పాటు స్థానిక పోలీస్, రెవిన్యూ సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొన్నారు. అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న కూలీలను జెసిబి సహాయంతో రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారిని బుట్టాయిగూడెం లోని తుఫాన్ పునరావాస కేంద్రానికి తరలించి ఆహరం అందించారు. అనంతరం వైద్య సహాయం అందించారు.

కూలీలు వరదలో చిక్కుకున్నారని తెలిసిన తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తమ ప్రాణాలను రక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కి, ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కు, జిల్లా యంత్రాంగానికి 22 మంది కూలీలు తమ కృతజ్ఞతలను తెలియజేసారు. జిల్లా యంత్రాంగానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.