-ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు గురువారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లపై పోలింగ్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో కూడా మాట్లాడి పోలింగ్ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, పోలింగ్ సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిందని, అన్ని రాజకీయ పార్టీలు తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయని చెప్పారు.
సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నామని, అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని తెలిపారు. రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తామని పేర్కొన్నారు.
తాను సందర్శించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో కూడా నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు.
కృష్ణా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వి. అభిషేక్ తో కూడా ఎన్నికల సరళి గురించి మాట్లాడారు.. పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.
