-వీఎంసీ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శనివారం వీఎంసీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు వివరించారు. తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. కానీ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే తెలుగుదేశం సభ్యులు అడ్డుకున్నారని మండిపడ్డారు. సభలో మేయర్ ఛైర్‌కు కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నారు. జాతీయ స్థాయిలో విజయవాడ నగరానికి వచ్చిన అవార్డులను చూసి టీడీపీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో పన్నుల భారాలు మోపి ప్రజల నడ్డి విరిచారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్ల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. 12 వేల మంది పేదల నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేసి.. 6వేల మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. వీరందరికీ న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వారి ఖాతాలలో తిరిగి డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ. 16 కోట్లు వారివారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటుగా వీరందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో వీఎంసీని కుంభకోణాలకు కేంద్ర బిందువుగా మార్చారని మల్లాది విష్ణు విమర్శించారు. బాండ్ల కుంభకోణం, టిడ్కో ఇళ్ల కుంభకోణాలే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజారంజకంగా పాలన సాగిస్తూ.. అన్ని రంగాలలో మెరుగైన ప్రగతిని సాధిస్తున్నట్లు వివరించారు. నగరంలో లక్షకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక టీడీపీ నేతలు సభలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో నగరం అభివృద్ధి పథంలో నడుస్తోందని మరోసారి స్పష్టం చేశారు.