గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, రోడ్ల మీద, కాలవల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సచివాలయాల వారీగా గుర్తించి సీజ్ చేయాలని ప్రజారోగ్య అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ సాంబశివపేట, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, మణిపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, ప్రతి రోజు ప్రజారోగ్య విభాగంలోని పర్మినెంట్ మరియు అప్కాస్ కార్మికుల హాజరు వివరాలు తమకు పంపాలని ఆదేశించారు. ఓల్డ్ క్లబ్ రోడ్ లో ఆంధ్ర కేఫ్ డస్ట్ బిన్లు సక్రమంగా ఏర్పాటు చేసుకోకపోవడం, ప్రధాన డ్రైన్ మీద ఆక్రమణలు పెట్టడం గమనించి వెంటనే కేఫ్ ని సీజ్ చేయాలని ప్రజరోగ్య అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్ రోడ్ లో కాల్వల్లో సిల్ట్ తీయడానికి వీలుగా గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలని, మెడికల్ వ్యర్ధాలు కాల్వల్లో వేయకూడదని నోటీసులు ఇవ్వాలన్నారు. కమర్షియల్ సంస్థలు ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, లేని వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు.
అనంతరం కమిషనర్ కార్మికులతో మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే కార్మికుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అందుకు తగిన విధంగా కార్మికులు తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా చేయాలన్నారు. సమస్యల పై ప్రతి గురువారం నిర్వహించే మీట్ ది కమిషనర్ కి నేరుగా ఫిర్యాదు ఇవ్వవచ్చని తెలిపారు. పర్యటనలో కార్పొరేటర్ యాట్ల రవి, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, యస్.యస్. ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News