-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు మీడియా సంస్థల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం, మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే కథనాలు, చర్చలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి సవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. మీడియా యాజమాన్యాల్లో పారదర్శకత, ప్రయోజనాల వైరుధ్యాల వెల్లడింపు, మహిళల గౌరవ పరిరక్షణకు సమష్టి కార్యాచరణ అవసరమని పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన “మీడియా యాజమాన్యాలు, ప్రయోజనాల వైరుధ్యం మరియు పర్యవసానాలు” అనే రౌండ్ టేబుల్ సమావేశానికి అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించి సమర్థవంతమైన నియమ నిబంధనలు రూపొందించాలని సూచించారు. మహిళలను కించపరిచే అసభ్యకర వ్యాఖ్యలు, కథనాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు.
ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, రాజకీయ కుటుంబాలు మీడియా సంస్థలను నిర్వహించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, మీడియా యాజమాన్యాలు తమ ప్రయోజనాలను పారదర్శకంగా వెల్లడించాలని అన్నారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ పోతుల బాలకోటయ్య, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, బీజేపీ నాయకుడు పాటూరి నాగభూషణం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీనియర్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మావతి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మీడియా స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యతను కాపాడాలని, మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారాన్ని అరికట్టాలని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించే నిష్పక్షపాత జర్నలిజాన్ని ప్రోత్సహించాలని వక్తలు పిలుపునిచ్చారు.
