విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠ్యాంశాలపై పట్టు సాధించినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందగలరని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. నగరంలోని వన్ టౌన్ నగరపాలక సంస్థ గాంధీ మునిసిపల్ హై స్కూల్ ను మంగళవారం కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేసారు. టెన్త్ క్లాస్ తరగతి గదిలో గణితం సబ్జెక్టు పై విద్యార్థులకు ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డు పై గణితానికి సంబంధించి ట్రిగ్నోమీటర్ డయాగ్రమును కలెక్టర్ స్వయంగా వ్రాసి విద్యార్థులను జవాబులడిగారు. తెలుగు భాష మాతృ భాష అని, హిందీ భాష జాతీయ భాష అని ఈ రెండు పాఠ్యాంశాలపై విద్యార్థులకు చదవడం, వ్రాయడం లో మంచి ప్రావీణ్యత పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు భాష బోధనలో మార్పులు తీసుకువచ్చి పటిష్టమైన బోధన అందించాలన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధన ఉండాలన్నారు. విద్యార్థులను పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. నెలరోజుల్లో మళ్లివస్తానని మంచి ఫలితాలు చూపాలని కలెక్టర్ ఉపాధ్యాయులను కోరారు.
పదో తరగతి విద్యార్థి తేజేశ్వరరావు ను అభినందించిన కలెక్టర్…
ఇటీవల నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలో హిందీ సబ్జెక్టు లో 20 కి 19 మార్కులు సాధించి ప్రతిభ కనపరచిన తేజేశ్వరరావు ను కలెక్టర్ ఢిల్లీరావు అభినందించారు. ప్రతి విద్యార్థి తేజేశ్వరరావు ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పర్యటనలో కలెక్టర్ తో పాటు డీఈవో సివి రేణుక, తహసీల్దార్ ఎమ్. మాధురి, హెడ్ మాస్టర్ పి.నీరజ ఉన్నారు.
Prajavartha Online Telugu News