Breaking News

వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం– నేతన్నకు ఆపన్న హస్తం.

వెంకటగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :

వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం– నేతన్నకు ఆపన్న హస్తం. అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగి ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను తిరుపతి జిల్లా వెంకటగిరిలో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం  వైయస్‌.జగన్‌.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

మీ చిక్కటి చిరునవ్వుల మ«ధ్య, చెరగని ఆత్మీయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు దేవుడి దయతో ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

వరుసగా ఐదో ఏడాది నేతన్న నేస్తం…
వెంకటగిరి నేల.. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేల. అలాంటి ఈ గడ్డ మీద నుంచి ఈ రోజు వరుసగా…. ఐదవ ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నాం.

బీసీలు బ్యాక్‌ బోన్‌ క్లాసులు..
బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. .బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా మారుస్తానని ఎన్నికల వేళ నేను చెప్పాను. ఆ రోజు చెప్పిన మాటకు ఈ నాలుగేళ్లలో ప్రతి పనిలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు కనిపించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాను. ఈ కోవలోనే నవరత్నాలు తీసుకుని వచ్చాను. నేతన్న నేస్తం తీసుకొచ్చాను.
సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ప్రతి సంవత్సరం రూ.24వేలు చొప్పున వరుసగా ఇస్తూ పోతామని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఐదవ సారి ఐదవ ఏడాది వరుసగా ఇవాళ్టితో కలిపి చూస్తే… రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టాం.

80,686 మంది చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకి మేలు జరిగేలా బటన్‌ నొక్కి వారి అకౌంట్లలో రూ.194 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఐదేళ్లలో రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం.

గతంలో నేతన్నలు ఎలా ఉండేవారో తల్చుకుంటే.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వారిని పట్టించుకోవాలి, తోడుగా నిలవాలి అన్న ఆలోచన ఆ ప్రభుత్వానికి ఏరోజూ రాలేదు. 2014–19 కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆ 77 కుటుంబాలకు కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. వారికి అండగా నిలబడ్డమే కాకుండా ఇలాంటివి ఎప్పుడూ జరగకుండా అడుగులు వేశాం. నవరత్నాలను తీసుకునివచ్చాం. ప్రతి పథకం కూడా ప్రతిపేదవాడి చేతిలో పెడుతూ వచ్చాం. ఇందులో భాగంగానే నేతన్న నేస్తం మొదలు నవరత్నాల్లోని ప్రతి పథకానికి శ్రీకారం చుట్టాం.

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన గత ప్రభుత్వం..
అదే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నో హామీలనిచ్చింది. దాదాపుగా 650 పైచిలుకు హామీలతో ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఎన్నికల అయిన తర్వాత హామీల గురించి ఎక్కడైనా, ఎవరైనా అడుగుతారామేనని 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన… మేనిఫెస్టోని చూపించి ఇది చేశామని గర్వంగా చెప్పాల్సింది పోయి.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. మేనిఫెస్టోను కనబడకుండా చేసిన సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని 2014–19 వరకు చూశాం. కాబట్టే నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గంషెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు ప్రతి ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కార్మికులుకు రుణమాఫీ చేస్తామన్నారు. రకరకాల హామీలన్నీ చేసుకుంటూ వచ్చి.. చివరికి చేనేతలను మోసం చేసింది. సంవత్సరానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి కనీసం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అలాంటి అధ్వాన్న పరిస్థితుల్లో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మన కళ్లెదుటనే కనిపించాయి. చాలామంది నేతన్నల కుటుంబాలు అతలాకుతళం అయ్యాయి.

మన ప్రభుత్వంలో నేతన్నల పరిస్థితి మారుస్తూ..
ఆ పరిస్థితులను మారుస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అడుగులోనూ, ప్రతి మాటలోనూ నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలుకు మేలు చేస్తూ…
రూ.2.25 లక్షల కోట్ల రూపాయాలు నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా నా నిరుపేద అక్కచెల్లెమ్మల కుటుంబాల్లోకి జమ చేశాం.నాలుగేళ్లుగా మీ బిడ్డ హయాంలో ఇది జరుగుతుంది.

ఎన్నికలప్పుడు చెప్పిన మాట నెరవేరుస్తూ…
ఇదే నేతన్న నేస్తానికి సంబంధించి ఎన్నికల వేళ చెప్పిన మాటను నెరవేర్చే కార్యక్రమం చేస్తూ.. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా పుట్టిన రోజునాడు డిసెంబరు 21 తేదీన వైఎస్‌ఆర్‌ నేతన్ననేస్తం తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి వేసిన అడుగు ఈ రోజుకు వరుసగా ఐదో దఫాతో కలిపి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడ్డాం.

నేతన్నల సంక్షేమం కోసం రూ.3706 కోట్లు.
నేతన్నలకు అండగా నిలబడుతూ.. వారికి సామాజిక ఫించన్ల రూపంలో రూ.1396 కోట్లు వారి చేతిలో పెట్టాం. నవరత్నాలలోని ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టాం. ఆప్కో బకాయిలు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు వెరసి మొత్తంగా రూ.3706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం చేయగలిగాం.
ఒక్కసారి ఆలోచన చేయండి. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి రూ.450 కోట్లు ఎక్కడ ? మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల కాలంలోనే రూ.3706 ఎక్కడా ? ఆలోచన చేయండి.

చేనేతను చేయిపట్టుకుని నడిపించాలని…
చేనేతను చేయిపట్టుకుని నడిపించాలని, నేతన్నకు తోడుగా ఉండాలని ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ మీద కూడా దృష్టి పెట్టాం. ఇంతకు ముందు లేని విధంగా అదనంగా అమెజాన్, మింత్ర, ప్లిఫ్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వస్త్రాలను అమ్మే ఏర్పాటు జరిగింది.
వెనుకబడిన సామాజిక వర్గాలకు అన్ని రకాలుగా చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. ఆర్దికంగా, రాజకీయంగా,విద్యా పరంగా, మహిళా సాధికారత పరంగా అన్ని రకాలుగా మేలుచేయడంలోనూ, అంబేద్కర్, పూలే భావజాలాన్ని అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నాం.

సంస్కారం కోల్పోయి వలంటీర్లపై అవాకులు…
ఇక్కడే మరో అంశాన్ని ఈ వేదిక మీద నుంచే చెప్పదల్చుకున్నాను. కొన్ని మాట్లాడకూడదు అనుకున్నా.. ఆ పరిస్ధితులు చూసినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది.
ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్ధలని, మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ కూడా అవమానించరు. కానీ మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వలంటీర్లు ఎవరూ కొత్తవారు కాదు. మన కళ్లెదుటనే నాలుగు సంవత్సరాలుగా కనిపిస్తున్నారు. మీ అందరికీ తెలిసినవాళ్లే. ఎండైనా, వానైనా, చలైనా, వరదలొచ్చినా, పండగరోజైనా, సెలవురోజైనా ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి, గుడ్‌మార్నింగ్‌ చెబుతూ ఇదిగో మీ పెన్సన్‌ అంటూ అవ్వాతాతలను చిరునవ్వులతో పలరించే కుటుంబసభ్యులు మన వలంటీర్లు.
అవినీతికి ఎక్కడా తావులేకుండా, వివక్షకు చోటు లేకుండా, మనందరి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రతి గడపవద్దకూ కాళ్లకు బలపం కట్టుకుని మరీ వెళ్లి.. కులం, మతం, వర్గం, ప్రాంతం చివరకి వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవలను మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్ధ మీద ఆ అవ్వాతాతల ఆశీస్సులతో సంతోషపడే వాళ్ల మీద, అదే గ్రామంలోనే సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

ఈ వలంటీర్లు అందరూ మన గ్రామం పిల్లలే. మన ఊరు పిల్లలే. మన ఇరుగుపొరుగు పిల్లలే.అందరికీ తెలిసిన మనవాళ్లే. ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్‌ ఈనాడు రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు అయితే.. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి.

నిస్సిగ్గు రాతలు…
వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటారు. గ్రామవలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారు.. ముంబాయికో, ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారు అని ఇంకొకరు నిస్సిగ్గుగా అంటారు. దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక, సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకో సిగ్గులేని టీవీ5 మీడియా రాస్తాయి. ఇటివంటి వారంతా బురద జల్లుతారు. అబద్దాలకు రెక్కలు తొడుగుతారు. వలంటీర్ల మీద కూడా ఇంత అన్యాయంగా బురద జల్లారు.
2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామస్ధాయిలో సేవలందిస్తున్నారు. ఇందులో 60 శాతం నా చెల్లెమ్మలే. మన వలంటీర్లు అంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవాభావంతో పనిచేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగుపొరుగు పిల్లలే. ఇలాంటి వారిని మన సేవామిత్రలు, సేవారత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల కేరెక్టర్‌ను తప్పుపట్టింది ఎవరో తెలుసా?

ప్యాకేజీ స్టార్‌ – చంద్రబాబుకు వలంటీర్‌.
ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్‌. ఇంకొకరు చంద్రబాబు నాయుడు. మరొకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీరంతా ఒక గజదొంగల ముఠా. వీళ్లు వలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతున్నారు. వలంటీర్ల కేరెక్టర్‌ ఎలాంటిదో అదే గ్రామంలో వారి సేవలందుకుంటున్న కోట్లమందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారో.

బాబు, దత్తపుత్రుడి కేరెక్టర్‌ అందరికీ తెలుసు…
అలాగే ఈ చంద్రబాబు కేరెక్టర్‌ ఎలాంటిదో ? ఈ దత్తపుత్రుడి కేరెక్టర్‌ ఎలాంటిదో ? అలాగే ఆయన సొంత పుత్రుడి కేరెక్టర్‌ ఎలాంటిదో? ఆయన బావమరిది కేరెక్టర్‌ ఎలాంటిదో ? ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. వీళ్ల కేరెక్టర్‌ ఎలాంటిదో కూడా ప్రజలకు బాగా తెలుసు.
మన వలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా ? లేక ఈ బాబుగారి వలంటీర్, ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లిచేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం మరలా వదిలేయడం… మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్లీ వదిలేయడం ఆ తర్వాత మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం.. పైగా ఒకరితో విహావ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వలంటీర్ల కేరెక్టర్‌ గురించి మాట్లాడతాడు. ఇలాంటి కేరెక్టర్‌ ఒకరిదైతే.. ఇంకొకరు పట్టపగలే మందుతాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే డాన్స్‌లు చేసేవాడు ఇంకొకరు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే.. నిస్సిగ్గుగా డాన్స్‌లు చేస్తూ కనిపిస్తాడు.

ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంట లేదా కడుపన్నా చేయాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు.
మరో కేరెక్టర్‌ ఉంది. వయస్సు 75 ఏళ్లు. అయినా సిగ్గులేదు. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడుతూ.. ఆహా బావ నువ్వు సినిమాల్లోనే చేశావు. నేను నిజజీవితంలోనే చేశాను అంటూ.. చేసిన వెధవపనులని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకరు. నిజంగా ఇలాంటి కేరెక్టర్‌ లేని వీరంతా మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరేంటి అని అడుగుతున్నాను.
మంచి చేస్తున్న వలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి కేరెక్టర్‌ లేనీ వీళ్లంతా కుయుక్తులు పన్నుతున్నారు. నిజంగా ఇలాంటి వారి మెదడు తెరిచి చూస్తే అన్నీ పురుగులే కనపిస్తాయి. వీళ్ల పర్సనల్‌ లైఫ్‌ అంతే, పబ్లిక్‌ లైఫ్‌లోనూ అంతే. ఎక్కడ చూసినా కుళ్లి బుద్దులు. కుట్రలే కనిపిస్తాయి.

బీజేపీతో పొత్తు చంద్రబాబుతో కాపురం.
ఇచ్చేది తన పార్టీ బీ–పారమ్‌. నిజానికి టీడీపీకి బీ–టీమ్‌. చంద్రబాబు మీద పోటీ ఒక డ్రామా. బీజేపీతో స్నేహం మరో డ్రామా. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటంటే… స్క్రిప్ట్‌ ఈనాడు రామోజిరావుది.నిర్మాత చంద్రబాబు. నటన, మాటలు,డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఇవీ నిజాలు.

వీరికి మంచి చేసిన చరిత్రే లేదు…
ఎందుకు ఈ స్ధాయికి దిగజారిపోయారు అంటే వీరికి మంచి చేసిన చరిత్ర లేదు. ఫలానామంచి చేశాం.. అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్కటి మంచి చేసిన చరిత్ర కూడా లేదు. ఉన్నదంతా వంచన, వెన్నుపోట్లు మాత్రమే. ఇదీ వీళ్ల జీవిత చరిత్ర.

ఇదీ మన చరిత్ర…
మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఈ 50 నెలల్లోనే మనందరి ప్రభుత్వంలో ఏకంగా రూ.2.25 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా కూడా లంచం లేకుండా, వివక్షకు తావులేకుండా నేరుగా జమ చేయడం మన చరిత్ర.
నా అక్కచెల్లెమ్మల పేర్లతో వాళ్లకు తోడుగా నిలబడుతూ అక్షరాలా 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం మన చరిత్ర.

30 లక్షల ఇళ్ల పట్టాలివ్వడంతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం మన చరిత్ర.
ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ.. రూ.26వేల కోట్లకు పైగా అమ్మఒడి పథకం ద్వారా తోడుగా నిలబడ్డం, దేశంలో ఎక్కడా జరగని విధంగా చేయడం మన చరిత్ర.
దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరాగా… వారికి తోడుగా నిలబడుతూ రూ.19,178 కోట్ల రూపాయలు వాళ్ల చేతుల్లో పెట్టడం, సున్నావడ్డీ కింద నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ రూ.3615 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టడం ఈ 50 నెలల కాలంలోనే మనం చేసిన ఈ మంచి మరో చరిత్ర. మీ బిడ్డ చరిత్ర.

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి మరో రూ.14,129 కోట్లు నా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టి, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేటట్టుగా వాళ్లకు వ్యాపారాలు సైతం చూపిస్తూ తోడుగా నిలబడుతూ అడుగులు వేయించడం ఇంకో చరిత్ర.
రైతుభరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతన్నలకు రూ.31వేల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి రైతన్నల అకౌంట్లలో జమ చేయడం మన చరిత్ర.

పిల్లలు చదవాలి, చదువులుకోసం పిల్లలు ఇబ్బందిపడకూడదు, ఏ తల్లి, తండ్రీ తమ పిల్లల చదువులు కోసం అప్పులు పాలు కాకూడదని, ఆ పిల్లల చదవులుకోసం తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకుని రావడమే కాకుండా.. పిల్లకు మెస్‌ ఛార్జీలకు, బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలను తీసుకొచ్చాం. ఈ రెండు పథకాలకు ఈ 50 నెలల్లో రూ.15వేలు కోట్లు ఇచ్చాం. ఇదీ మన చరిత్ర.

పిల్లల బాగోగులు కోసం, పిల్లలు గొప్పగా చదవాలి, వాళ్లుబాగుండాలని ఆరాటపడుతూ వాళ్లకి ఇంగ్లిషు మీడియం విద్య, నాడు నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లు, మూడోతరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెఫ్ట్, మూడోతరగతి నుంచే టోఫెల్‌లో సైతం ప్రిపరేషన్, ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఉండేలా ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్‌ చేయడం, 8వతరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపీణీ, రోజుకొక మెనూతో పిల్లలకు గోరుముద్ద అనే పథకాన్ని తీసుకునిరావడం, స్కూళ్లు తెరిచేటప్పటికే ఆ పిల్లల చిక్కటి చిరునవ్వుల మధ్య కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా విద్యాకానుక పంపిణీ.. ఇది మన పిల్లల భవిష్యత్‌ కోసం చేస్తున్న మన చరిత్ర.

మారుతున్న గ్రామం– మన చరిత్ర.
ప్రతి గ్రామంలోనూ రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్‌ వ్యవస్ధ, ఆర్బీకేలు కనిపిస్తాయి. నాలుగడుగులువేస్తే విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ కనిపిస్తుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లూ కనిపిస్తాయి. మారుతున్న ఈ గ్రామం.. .మన చరిత్ర.

కొత్తగా 108, 104 వాహనాలు 1600 పైచిలుకు కుయ్‌ కుయ్‌మంటూ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారాయి. గతంలో సరిగ్గా నిర్వహంచకుండా.. కేవలం 1000 వ్యాధులకు పరిమితమైన ఆరోగ్యశ్రీని.. 3250 వ్యాధులకు విస్తరించాం. ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా ఆరోగ్యఆసరా కూడా తీసుకొచ్చాం. కోవిడ్‌ టైంలో దానిమీద మనం చేసిన యుద్ధం.. ఇవన్నీ ఇంకొక చరిత్ర… ఇదీ మన చరిత్ర.

ఒక అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళాసాధికారత విషయంలో దేశం మొత్తం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా చేసిన చరిత్ర.. ఇదీ మన చరిత్ర. సామాజిక న్యాయంలో ఎవ్వరూ చూడని విధంగా, ఎవ్వరూ చేయని విధంగా ప్రతిఅడుగులో నా ఎస్సీ,ఎస్టీ, బీసీ, నా మైనార్టీలంటూ ఏకంగా 50 శాతం నామినేటెడ్‌ పదవులు, 50 శాతం నామినేషన్‌ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న చరిత్ర.. ఇదీ మన చరిత్ర.

రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా… అసైన్డ్‌ భూములు మీద హక్కులు ఇచ్చిన చరిత్ర మనది. 2 లక్షలకు పైగా చుక్కల భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉంటే.. దాన్ని మార్చి ఆ చుక్కల భూముల సమస్యలను తొలగించి రైతన్నల చేతిల్లో పెట్టిన చరిత్ర మనది.

మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా చెత్తబుట్టలో పడేయడం కాదు. దాన్నొక బైబిల్‌గానూ, ఖురాన్‌ గానూ, భగవద్గీత గానూ తలచి చెప్పిన ప్రతి పనీ చేస్తూ… ఏకంగా 98 శాతం హామీలను నెరవేర్చి గడప,గడపకూ తిరుగుతూ ప్రజలవద్దకూ వెళ్తూ.. ఈ మేనిఫెస్టోను వాళ్ల చేతుల్లో పెడుతూ మీరే చదివి మీ బిడ్డని ఆశీర్వదించండి అని అడుగుతున్న చరిత్ర మన చరిత్ర.

ఏకంగా 26 జిల్లాలు చేసిన చరిత్ర మనది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంతవరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయంలో ఈ నాలుగేళ్లలో ఏకంగా 50 శాతం పెరిగి 6 లక్షలకు చేరాయి. 2.06 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మనది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి. ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర కూడా మనదే.

స్వాతంత్రం వచ్చిననాటి నుంచి మన ప్రభుత్వం వచ్చేవరకు రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మరో 17 కడుతున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రరాష్ట్రంలో 4 చోట్ల 6 పోర్టులుంటే.. మన ప్రభుత్వంవచ్చిన తర్వాత నాలుగేళ్లలో మరో 4 పోర్టులు కడుతున్నాం. ఇదీ మన చరిత్ర.
10 పిషింగ్‌ హార్భర్లు, మరో 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ బాధ్యతతో, మమకారంతో, పేదలపట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో చేస్తున్నాం.

ఇంతకముందుకు ఇప్పటికీ తేడా చూడండి.
మనిషి కేరెక్టర్, విశ్వసనీయత విషయంలో కానీ, మేనిఫెస్టోకి ఇస్తున్న విలువ గురించి కానీ, తాను చేస్తున్న మంచి విషయంలోనైనా ఆలోచన చేయండి.
ఎలాంటి పాలకుడు మనకు కావాలి, ఎలాంటి పాలన మనకు కావాలన్నది ఆలోచన చేయండి. ఎందుకు ఇంతగా తేడా గమనించండి అని చెబుతున్నానంటే..
మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. వాళ్ల మాదిరిగా ఒక అబద్దాన్ని పదే, పదే చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించే మీడియా సామ్రాజ్యం లేదు.

మీ బిడ్డ దేవుడి దయను, మిమ్నల్నే నమ్ముకున్నాడు…
మీ బిడ్డ వీటిని నమ్ముకోలేదు. మీ బిడ్డ దేవుడి దయను,మిమ్మల్ని తప్ప ఇంకొకరని నమ్ముకోలేదు.
అందుకే మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా అబద్దాలు చెప్తారు. ఇవాళ వలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో.. ఇంకా రాబోయే రోజుల్లో మీ బిడ్డ గురించి, మీ బిడ్డ ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అదే మాదిరిగా దారుణంగా అబద్దాలు చెప్తారు. ఇవేవీ నమ్మవద్దు.

ఒక్కటే కొలమానం..
ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా ? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. అబద్దాలను నమ్మకండి. మోసాలను చేసే ఇటువంటి వారిని నమ్మకండి. కేవలం మీకు మంచి జరిగిందా ? లేదా ?అన్నది ఒక్కటి మాత్రమే చూసుకొండి. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలి. మన పిల్లలు ఇంకా గొప్పగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను.

కాసేపటి క్రితం..
రామ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి పనులు అడిగారు. ఆల్తూరుపాడు ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలుసు. ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి చూశాం. రివైజ్డ్‌ ప్రాజెక్టు కాస్ట్‌ ఎస్టిమేషన్‌ తయారు చేయిస్తే.. రూ.553 కోట్లు అన్నారు. వాటికి కూడా అనుమతులు మంజూరు చేస్తాను. 6 మండలాల్లో డ్రెయిన్లు, సీసీ రోడ్లు కోసం రూ.20 కోట్లు అడిగారు. వాటిని కూడా మంజూరు చేస్తున్నా. వెంకటగిరి మున్సిపాల్టీలో డ్రెయిన్లు, సీసీ రోడ్లు కోసం అడిగారు. దీనికి సంబంధించి ప్రతి గడపకూ తిరగమని రామ్‌కు చెప్తున్నాను. ఒక్కో సచివాలయానికి రూ.50 లక్షలు కేటాయింపజేస్తాను. వెంకటగిరికి ఇరికేషన్‌ ట్యాంకుకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ గురుకుల స్కూల్‌ అడిగారు. ఇవి కూడా మంజూరు చేస్తూ.. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *