అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజకీయాల్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. భారత చైతన్య యువజన పార్టీ (బిసివైపి) పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకులు, పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ప్రజా సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభను జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఆదివారం నిర్వహించారు. తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 23వ తేదీ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఘన చరిత్ర వున్న ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా వున్నాయన్నారు. రాష్ట్రంలో రైతులు, యువకులు, మహిళలు పరిస్థితి ఎలా వుంది… ఎలా ఇబ్బందులుపడుతున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. రైతుల వలసలు ఆపే పరిస్థితుల్లో పాలకులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్ట్ పేర్లతో వేల కోట్లు అవకతవకలు, ఎర్రచందనం దోపిడీ జరుగుతోందన్నారు. దీర్ఘకాలంగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. రాష్ట్రం విడిపోతుంటే ఆపలేని పరిస్థితిలో ఆ పార్టీలు వున్నాయన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రాజధాని అభివృద్ధి చేసే అవకాశం వున్నప్పటికీ టీడీపీ తన సొంత సామాజికవర్గ అభివృద్ధి కోసం పనిచేసిందని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావమే దౌర్భాగ్యం కాగా, 2019లో రాక్షస పాలనకు ప్రజలు మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. హత్యలు, మానభంగాలు పెరిగిపోయి, ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారని, ఇసుక, లిక్కర్ స్కాంలు పెరిగిపోయాయని విమర్శించారు. చివరకు సినిమా రిలీజ్కు 20 శాతం కమీషన్ కప్పం కట్టాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జరగాలంటే దోపిడీ, హత్యలు, వెన్నుపోటు, కుటుంబ రాజకీయ పార్టీలకు చరమగీతం పాడాల్సిన అవసరం వుందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బిసివైపిని ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బిపి మండల్ మనవడు సూరజ్ మండల్, ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News