– సమన్వయ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌వో) బీహెచ్ భవానీ శంకర్ బుధవారం నియోజకవర్గానికి సంబంధించి సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్ఎస్ఎం స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రిసెప్షన్ సెంటర్‌లకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత ప్రణాళిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి.. పటిష్ట సమన్వయంతో, అప్రమత్తతతో వ్యవహరించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నిబద్ధతతో భాగస్వాములు కావాలని ఆర్‌డీవో భవానీ శంకర్ సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందికి సూచించారు. సందర్శనలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్లు ఎ.మహేష్, కేవీ సత్యవతి, ఏసీపీలు భాస్కరరావు, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News