
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు తెలియజేసేలా మీడియా సెంటర్ ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటుకు జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కలెక్టర్ డిల్లీరావు బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఉన్న డీఐపీఆర్‌వో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈసీఐ సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరముందన్నారు. మీడియా సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీడియా ప్రతినిధులకు సకాలంలో అందజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రసార మాధ్యమాల సహకారం ఎంతో అవసరమన్నారు. అందువల్ల మీడియా ప్రతినిధులకు ఎన్నికల సమాచారాన్ని సకాలంలో అందించడంలో సమాచార శాఖ అధికారులు సఫలీకృతం కావాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. జిల్లాలో నియోజకవర్గాల మ్యాపులను, ఓటర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఎన్నికల అధికారుల వివరాలను ప్రత్యేక బోర్డుల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్నందున ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా రూపొందించిన నివేదికల సమాచారాన్ని మీడియా సెంటర్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల మార్గదర్శకాల మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మీడియా సెంటర్ ద్వారా నాణ్యమైన సేవలు అందించి ఎన్నికలను విజయవంతం చేయడంలో నిబద్ధతతో భాగస్వాములు కావాలని సూచించారు. మీడియా సెంటర్ ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహనరావు, అడిషనల్ పీఆర్‌వో కె.రవి, ప్రచార సహాయకులు వీవీ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News