– ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– గ్రామ అభివృద్ధి ప్రణాళిక (వీడీపీ) మ్యాపులను ప్రదర్శించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామసభలను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. గ్రామసభల నిర్వహణపై కలెక్టర్ సృజన గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ అభిృవృద్ధి, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ గ్రామాలను సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ప్రభుత్వం నిర్వహించే గ్రామసభలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, భాగస్వాములయ్యేలా ప్రోత్సహించాలన్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీటి కుళాయిలు, మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా వ్యవస్థ, డ్రెయినేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, ఇతర గ్రామాలకు, పట్టణాలకు అనుసంధాన రహదారులు, వ్యర్థాల నిర్వహణ తదితరాలపై చర్చించాలన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళిక (వీడీపీ)కు సంబంధించి రూపొందించిన రేఖా చిత్రాలను ప్రదర్శించాలని.. గ్రామసభల్లో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషిచేయాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టేందుకు గుర్తించిన పనులపై చర్చించి, ఆమోదం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు ఈ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సృజన సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె.సునీత, డీపీవో ఎన్‌వీ శివప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.