– చేనేత, హస్తకళల కళాకారులకు మాల్ వేదికగా మార్కెట్ అవకాశాలు
– నాబార్డు – నేస్తం ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు
– ప్రారంభించిన నాబార్డు ప్రాంతీయ కార్యాలయ సీజీఎం సోమేందర్ సింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామీణ ప్రాంతాల్లోని చేనేత కళాకారులు, హస్తకళాకారులు ఎంతో నైపుణ్యంతో తయారుచేసే సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సోమేందర్ సింగ్ అన్నారు.
సోమవారం ఎంజీ రోడ్డులోని పీవీపీ స్క్వేర్ మాల్‌లో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ సోమేందర్ సింగ్.. నేస్తం ఫౌండేషన్ సీఈవో సురేష్ వేసం తదితరులతో కలిసి స్టాల్ ఇన్ మాల్ స్టాళ్లను ప్రారంభించారు. హస్తకళలు, చేనేత కళాకారులతో మాట్లాడి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమేందర్ సింగ్ మాట్లాడుతూ కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను నేరుగా పట్టణ ప్రాంతాల వినియోగదారులకు పరిచయం చేయడం ద్వారా వారికి మెరుగైన మార్కెట్‌ను అందించవచ్చన్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, సంప్రదాయ కళాఖండాలను ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్ మాల్స్‌లో ప్రదర్శనకు ఉంచడం ద్వారా కళాకారులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని వివరించారు. గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను పట్టణ వినియోగదారులకు చేరువ చేయడంతో పాటు, సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలు, హస్తకళల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను పరిశీలించి కొనుగోలు చేసే అవకాశం కలగడం వల్ల కళాకారులకు వారి శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం లభించే అవకాశం ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులతో పాటు చేనేత, హస్తకళలను నాబార్డు అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు.
నేస్తం ఫౌండేషన్ సీఈవో సురేష్ వేసం మాట్లాడుతూ చేనేత రంగం, హస్తకళలు మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని, తరతరాలుగా కళాకారులు తమ నైపుణ్యంతో ఈ కళలను కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. స్టాల్ ఇన్ మాల్ స్టాళ్లు ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడం, కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం వంటి లక్ష్యాల సాధనలో నాబార్డు ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నాబార్డు, నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా గ్రామీణ కళాకారులకు మార్కెటింగ్ పరంగా కొత్త అవకాశాలు లభించడంతో పాటు, స్థానిక ఉత్పత్తులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి స్టాళ్లను సందర్శించి చేనేత, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో నాబార్డు డీడీఎం ఎన్.సత్యనారాయణ, పీవీపీ మాల్ మేనేజర్ అనిల్, నేస్తం సిబ్బంది కె.లక్ష్మీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
