-నాలుగోసారి కార్పొరేటర్‌గా ప్రజల ఆదరణ.. డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా
-వంగవీటి రాధాకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన వీరమాచినేని లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత 64వ డివిజన్లో ఏకగ్రీవ ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కావడం విశేషమని ఆమె పేర్కొన్నారు. ఈ విజయం డివిజన్ ప్రజలందరికీ ఆనందకరమైన విషయమని తెలిపారు. తాను నాలుగోసారి కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, ఆదరాభిమానాలకు నిదర్శనమని అన్నారు. వరుసగా ప్రజల మద్దతు లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, తనను ఆదరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో తన పదవీకాలంలో డివిజన్లో రహదారుల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులతో పాటు చేపల మార్కెట్, పొట్టి శ్రీరాములు పార్కు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తుచేశారు. వెన్ను దన్నుగా ఉంటూ భరోసా కల్పిస్తూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న తన భర్త కిశోర్ పుట్టిన ప్రాంతం కావడంతో ఈ డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. రాబోయే మేయర్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణను ప్రజలందరూ అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. చివరిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగవీటి రాధాకృష్ణ విజయానికి ప్రజలందరూ సహకరించి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు.
