-ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు…
-విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అందరు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడి దీనిపై సూచనలు చేశామన్నారు. కళాశాలల ప్రాంతీయ విద్యాధికారులు, పాఠశాల ప్రాంతీయ విద్యా సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులు, విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు ఈ మేరకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు (అభివృద్ధి), జిల్లా వైద్యాశాఖధికారులతో సంప్రదించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు జరుగుతున్న వాక్సిన్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు మంత్రి పేషీకి సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.