మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే డిసెంబర్ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహించుటకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ నెల 7వ తేదీన అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి అంశం పైన మార్గదర్శకాలను జారీ చేసిందని వాటిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదివి ఆ ప్రకారం సమావేశాన్ని విధిగా నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలకు ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసిందని ఆ నిధులతో, దాతల సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ముందుగా మండల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు వారి పరిధిలోని ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి మెగా సమావేశం ఏర్పాట్లపై చర్చించాలన్నారు. సమావేశంలో ఏర్పాటు చేసే బ్యానర్లో ఎక్కడ కూడా ఎవరి ఫోటోలు ఉండకూడదని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు.
ఇందుకోసం పాఠశాల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, ఆహ్వాన పత్రికల నమూనాలను ఇచ్చారని వాటిని విద్యార్థుల చేతనే తయారు చేయించాలన్నారు. ఆహ్వాన పత్రికలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భౌతికంగాను, వాట్సాప్ ద్వారా పంపాలన్నారు. ప్రతి రోజు డిసెంబర్ 7వ తేదీన జరిగే సమావేశం గురించి పాఠశాల లో జరిగే ప్రార్థనా కూటమి సమయంలో తెలియజేయాలన్నారు. ఆరోజున పాఠశాలను మామిడాకులు, అరటి పిలకలతో అందంగా పండుగ వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దాలన్నారు.
పాఠశాల ప్రాంగణమంతా ఎటువంటి చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
కొన్ని పాఠశాలల్లో భవన నిర్మాణము జరుగుతూ అక్కడే ఇనుము తదితర సామాగ్రి ఉంటుందని ఎటువంటి సమస్య లేకుండా వాటిని దూరంగా ఒక గదిలో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను వారి తల్లిదండ్రులకు అందజేసి ఏ విషయాలలో విద్యార్థి పురోగతి బాగుందని, ఏ విషయాల్లో సరిగా లేడని, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలియజెప్పాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగాఫ్ వార్ పోటీలను, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఏమైనా వైద్య సమస్యలు తలెత్తితే వెంటనే చూసేందుకు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఏమైనా సలహాలు ఉంటే స్వీకరించాలని ఇందుకోసం ఒక సలహాల పెట్టెను అందుబాటులో ఉంచాలన్నారు. పెనమలూరు,ఉయ్యూరు, గుడివాడ లలో విద్యార్థులకు ఆధార్ అప్డేషన్లో అలెత్తిన సమస్యలను పరిష్కరించి పురోగతి సాధించాలన్నారు.
సామాన్య స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన 60 మంది పూర్వ విద్యార్థుల విజయ గాధలను అందజేశామని వాటిని ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన కూటమి సమయంలో ఆకట్టుకునే విధంగా నాకు సాధ్యమే అని ప్రతి విద్యార్థి ప్రేరణ పొందేలా చదివి వినిపించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి రామారావు,సర్వ శిక్ష ఏపీసి శ్రీరాముల నాయక్, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సాల్మన్ రాజు, పలువురు మండల ప్రత్యేక అధికారులు, ఉపవిద్యాధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News