Breaking News

చేయి చేయి కలుపుదాం.. బాల్యవివాహం అనే జాడ్యాన్ని సమాజం నుండి తరిమికొడదాం…

-“బాల్ వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమంలో డాక్టర్ బి.కీర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో జరిగే బాల్యవివాహాలు 27 శాతం జరుగుతుంటే అందులో 29.6 శాతం మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అంటే దీనిపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతుందో గణాంకాలను బట్టి అర్ధం అవుతుంది. బాల్య వివాహాలు అనే సామాజిక రుగ్మతను అరికట్టాలంటే ప్రతీ వ్యక్తి తమవంతు బాధ్యత తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి. కీర్తి తెలియజేసారు. బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగిన “బాల్ వివాహ్ ముక్త్ భారత్” ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సత్యార్థి పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి గత సంవత్సరం ఏప్రిల్ నుండి కృష్ణా మరియు యన్.టి.ఆర్ జిల్లాలలో బాల్యవివాహాలు నిరోధించడానికి కృషి చేస్తున్నామని, ఇలా వారు 216 స్వచ్చంద సంస్థలతో భారతదేశంలోని 416 జిల్లాలలో బాల్యవివాహాలు నిరోధించేందుకు పనిచేస్తూ ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద రొండు లక్షల బాల్య వివాహాలు జరగకుండా చూసారు అంటే దీని మీద సమాజం దృష్టి సారించవలసిన ఆవశ్యకతను చెబుతుందని ఆమె అన్నారు.

ఈ 20 నెలల్లో వాసవ్య మహిళా మండలి రొండు జిల్లాలలో బాల్య వివాహ నిర్మూలన కొరకు స్కూలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యులు, అన్ని వర్గాల ప్రజలతో 2,50,963 ప్రతిజ్ఞలను చేపించడమే కాకుండా వీటి ద్వారా 74 బాల్య వివాహాలు జరగకుండా ఆపడం జరిగిందని ఆమె అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా దీనిని రూపుమాపడానికి కృషి చేస్తున్నామని ఆమె అన్నారు. ఇప్పటికీ బాల్య వివాహాలు మన ఆంధ్రప్రదేశ్ లో జరగడానికి గల ప్రధాన కారణం ఏమంటే నిబద్ధతతో చట్టాలను అమలు చేయలేకపోవడం, బాల్య వివాహాలు ఆపుదల చేసినప్పుడు రాజకీయ పార్టీల నుండి వత్తిడి చేయడం మేము గమనించామని ఆమె అన్నారు. అందరూ అనుకుంటారు బాల్య వివాహాలు ఆపడం మహిళా శిశు సంక్షేమ శాఖ పని అని. కాదు ఇది సమజంలో ఉన్న ప్రతీ వ్యక్తి బాధ్యత తీసుకున్నప్పుడే దీనిని రూపుమాపగలం అని అమె పిలుపునిచ్చారు. 2030 వ సంవత్సరంకల్లా భారతదేశంలో ఒక్క బాల్య వివాహం జరగకుండా ఉండాలన్న ఆకాంక్షతో ఈ “బాల్ వివాహ్ ముక్త్ భారత్” అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

బాల్య వివాహాలను నిరోధించడానికి 2002 లో మ్యారేజి రిజిస్ట్రేషన్ యాక్ట్ ను తీసుకొచ్చారు, కానీ పంచాయితీలో, మండలాలలో గాని నమోదు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాకుండా జి.ఒ నెంబర్ 31 ప్రకారం ప్రతీ గ్రామాలలో “చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్లు” నియమించాలని చెబుతుంది కాని అమలు కావట్లేదని, ఇప్పుడున్న యమ్.యస్.కె లకు దీనిపై శిక్షణ ఇవ్వలేదని దీనిపై సరిఅయిన కార్యచరణ ను ఇవ్వవలసిన ఆవస్వకత ఉందని ఆమె అన్నారు.

వాసవ్య మహిళా మండలి మరియు యన్.టి.ఆర్, కృష్ణ పోలీస్ వారి సంయుక్త ఆద్వర్యంలో యమ్.యస్.కె లకు శక్తి టీం వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. బడిలోని బాలికలు చదువు ఆపి వేసినప్పుడు దానికి గల కారణాలను తెలుసుకోవడానికి సరైన ట్రాకింగ్ మెకానిజమ్ ను అభివృద్ధి చేయాలని, కోవిడ్ సమయంలో లాక్ డౌన్ అనంతరం బాల్య వివాహాలు 27 నుండి 33 శాతానికి పెరిగాయన్న విషయం ఆమె గుర్తుచేశారు. ప్రతీ పాఠశాలల్లో ఎనిమిది నుండి పది తరగతి వరకు “చిల్డ్రన్ యాజ్ చేంజ్” గ్రూపులను అభివృద్ధి చేసి వారి తోటి విధ్యార్థులు ఎందుకు చదువు మానివేసారో, వెళ్ళి తదితర విషయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తెలియజేయటం చేస్తే మంచి ఫలితాలను చూడవచ్చని ఆమె తెలిపారు. సెర్చ్ లో ఉన్న 80 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల సభ్యులకు బాల్య వివాహాలపై సమగ్ర శిక్షణను ఇవ్వాలని ఆమె అన్నారు. ప్రతీ గ్రామంలో జెండర్ రీసోర్స్ సెంటర్ల బలోపేతానికి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె అన్నారు.

అనంతరం యం.కృష్ణమూర్తి నాయుడు, అడ్మిన్, డి.సి.పి, పోలీస్ కమీషనర్, యన్.టి.ఆర్ జిల్లా మాట్లాడుతూ బాల్య వివాహాల గల ముఖ్య కారణం పెళ్ళికి ఖర్చు మరియు వారి రక్షణ అని చెప్పవచ్చు అని అన్నారు. బాల్య వివాహాలు జరిగినప్పుడు కౌమార దశలోనే గర్బం దాల్చడం వలన బాలిక ఆరొగ్యపరంగా మరియు మానసికంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొనవలసి వస్తుందని అది, కొన్ని సార్లు బిడ్డ సరిగా ఎదగకుండా ఉండటం లేదా తల్లి మరణానికి దారి తీసిన సందర్బాలు ఉన్నాయని, అంతేకాకుండా దీనివలన గృహ హింస కూడా ఎక్కువగా బాలికలు గురి అవుతున్నారని, ఇంకా తన జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడతాయని ఆయన అన్నారు.

అనంతరం శ్రీమతి జి.ఉమాదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ మాట్లాడుతూ ఈ రుగ్మతను తరిమికొట్టడంలో తమవంతు బాధ్యతగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల, యువత, యన్.యన్.యస్, ప్రజలు అందరూ కలిసి కట్టుగా పనిచేసిన రోజే బాల్య వివాహాలను మన దేశంలో జరగకుండా చేసి బాలికల జీవితాలలో సంతోషం నింపగలమని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాసవి, సి.ఐ. మహిళా పోలీస్, వివిధ స్వచ్చంద సేవా సంస్థ సిబ్బంది, పోలీసు వారు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *