-ఎంఎస్ఎంఈ, ఖాదీ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటు
-సబ్సిడీ రుణాలు, యూనిట్లపై విస్త్రృత ప్రచారం
-20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత
-ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా కేకే చౌదరితో ప్రమాణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ఎంఎస్ఎంఈ, ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా నియమితులైన కేకే చౌదరితో మంత్రి సవిత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే 5 అయిదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. దీనిలో భాగంగా ఎంఎస్ఎంఈలు, రాష్ట్ర ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించిన ఔత్సాహికులతో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామన్నారు. ప్రతి జల్లాలోనూ, నియోజక వర్గాల్లోనూ విరివిగా యూనిట్ల ఏర్పాటుచేసి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చనున్నామన్నారు. యూనిట్ల ఏర్పాటు, సబ్సిడీ రుణాల మంజూరుపై ప్రతి నియోజక వర్గంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. . ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేకే చౌదరిని అభినందిస్తూ…ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వివరాలు, పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
కష్టకాలంలో కష్టపడిన వారికి అందలం…
గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని మంత్రి సవిత తెలిపారు. టీడీపీని భూస్థాపితం చేయాలన్న కుట్రతో తమ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు, వేధింపులకు పాల్పడ్డారన్నారు. టీడీపీలో చురుకుగా పనిచేసేవారిని గుర్తించి, వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. తనపైనా 18 అక్రమ కేసులు బనాయించారని మంత్రి తెలిపారు. జగన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించడానికి యువగళం పేరుతో మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారన్నారు. భువనమ్మ, బ్రాహ్మిణమ్మ…లోకేశ్ కు వీరతిలకం దిద్ది అండగా నిలిచారన్నారు.
ఈ పోరాటంలో లోకేశ్ వెంట కేకే చౌదరి వంటి యువకులు నిలిచి…
జగన్ రెడ్డి రాక్షస పాలనకు చరమగీతం పాడారన్నారు. కష్టకాలంలో భుజాన జెండా మోసిన కార్యకర్తలకు, నాయకులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడినవారికి ఇటీవల ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల పాలకమండళ్లలో అవకాశమిచ్చారన్నారు. అంతకుముందు ఏపీ ఖాదీ గ్రామీణ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కేకే చౌదరికి మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు, ఏపీ ఖాదీ బోర్డు సీఈవో విజయరాఘవ నాయక్, టీడీపీ నాయకులు రూపానందరెడ్డి, కస్తూరి విశ్వనాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News