-బీసీ కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం..
-అగ్నికుల క్షత్రియులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు..
-గత ప్రభుత్వ హయాంలో బీసీలను ఓటు బ్యాంకు గానే చూశారు..
-అలంకారప్రాయంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిధులు కూడా కేటాయించలేదు..
-కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2024-25 ఏడాదికిగాను రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.39,007 కోట్లు కేటాయించడం జరిగిందని రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం విజయవాడలోని గొల్లపూడి, బి.సి. సంక్షేమ భవనంలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిలకలపూడి పాపారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందులో భాగంగా 15 మంది కార్యవర్గ సభ్యులతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. తొలి నుంచి అగ్నికుల క్షత్రియులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. 2014-19 ప్రభుత్వ కాలంలోనే కార్పొరేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, వాటికి నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడమేగాక, ఒక్క రూపాయి నిధులు కూడా వాటికి కేటాయించలేదన్నారు. బీసీ నేతగా ఉన్న నన్ను గత ప్రభుత్వం చేయని తప్పుకు అక్రమ కేసులో ఇరికించి 54 రోజులపాటు జైల్లో పెట్టి బాధపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో బీసీలకు మంచిరోజులు వచ్చాయన్నారు. తాజాగా బడ్జెట్ లో బీసీ వెల్ఫేర్‌కు రూ.39 వేల కోట్లు కేటాయించడం జరిగిందని, వాటిని తగినవిధంగా కార్పొరేషన్లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చిలకలపూడి పాపారావు ప్రస్తుత పదవికి మరింత వన్నె తెచ్చి, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, నిధులు మాత్రం కేటాయించలేదన్నారు. కార్పొరేషన్ల పేరుతో కుర్చీలయితే ఇచ్చారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బీసీ సామాజికవర్గాలకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. అగ్నికుల క్షత్రియుడినైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 50 వేల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన ఘనత పవన్ కళ్యాణ్‌కే దక్కుతుందన్నారు.
మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు చేపడుతున్న బీసీ నాయకులంతా బాధ్యతతో పనిచేసి రాబోయే రోజుల్లో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ.. వివిధ జిల్లాలకు చెందిన 15 మంది కార్యవర్గ సభ్యులతో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తనను నమ్మి ఈ బాధ్యతలు అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సలహాలు, సూచనలకు తగ్గట్టుగా నడుచుకుని అగ్నికుల క్షత్రియుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. అగ్నికుల క్షత్రియుల్లో వివిధ వృత్తులు పాటిస్తున్నవారు ఉన్నారని, మత్స్యకారుల సమస్యలపై అవగాహన ఉందని ఈ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తానని చెప్పారు. గంగపుత్రులకు మేలు చేసేలా చర్యలు చేపడతామని గత ఐదేళ్లుగా అగ్నికుల క్షత్రియులు కష్టపడ్డారని, వారిని ఇప్పుడు ఆదుకుంటామని వెల్లడించారు.
అంతకుముందు జరిగిన కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ జేఎండీ ఉమాదేవి ఛైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అభిమానులు, అగ్నికుల క్షత్రియ సంఘాల నాయకులు, బీసీ నేతలు, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News