ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రం వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించటానికి ప్రణాళికను రూపొందిస్తుందా? ప్రారంభిస్తే ఆ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఈ రైళ్లను ఏ మార్గాలకు కేటాయిస్తారో తెలపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిస్తూ 2024 నవంబర్ 21 నాటికి దేశంలో 136 వందే భారత్ ట్రైన్ సేవలు చైర్ కార్లతో అమలులో ఉన్నాయన్నారు. ఇవి భారతీయ రైల్వే బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫైడ్ నెట్‌వర్క్‌లో ప్రారంభించబడ్డాయని తెలిపారు. ఇవి ప్రస్తుతం వున్న రైల్ సేవలను భర్తీ చేయకుండా ప్రవేశపెట్టబడ్డాయన్నారు. అలాగే, వందే భారత్ ట్రైన్ సేవలు , దాని వేరియంట్లు కొత్త ట్రైన్ సేవలుగా ప్రవేశపెట్టడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని వివరించారు. కొత్త ట్రైన్ సేవలను ప్రవేశపెట్టే మార్గాలు సర్వే, ట్రాఫిక్ , ప్రాయోగికత అధ్యయనం ఆధారంగా నిర్ణయించబడుతుందన్నారు.
Prajavartha Online Telugu News