Breaking News

స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ – 2047ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. విజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధికల్పన, నైపుణ్యం- మానవవనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాలను సీఎం ఇది వరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైనా స్పష్టంగా విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *