మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎంపీపీలు, జడ్పిటిసిలతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, మత్స్య, వైద్య ఆరోగ్య, విద్య, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ క్రమంలో పలువురు సభ్యులు అనేక సమస్యలను లేవనెత్తి పరిష్కరించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల్లో పార్టీలకతీతంగా సభ్యులందరినీ భాగస్వామ్యం చేయాలని కోరారు.
సమావేశంలో మొదటిగా పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. అధిక తేమశాతం పేరుతో ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని, దీంతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుని ఆదుకోవాలని సభ్యులు కోరారు. అదేవిధంగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, పంటను భద్రపరుచుకునేందుకు టార్పాలిన్ పట్టాలు అందించాలని, కోసిన పంటను వెంటనే కొనుగోలు చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పంటను వెంటనే మిల్లులకు తరలించే విధంగా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారని, రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
రైతులకు కనీస మద్దతు ధర అందించే విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో 17 తేమశాతం ఉండాలని, అయితే అంతకు మించితే 24 తేమశాతం వరకు ఐదు కేజీల తరుగుతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 48 గంటల్లోనే ధాన్యం నగదు రైతు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం రవాణాకు వాహనాలు, గోనె సంచుల కొరత లేదని, ఏ ప్రాంతంలోనైతే ధాన్యం వెళ్ళక నిలిచిపోయిన పరిస్థితులు ఏమైనా ఉంటే సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావాలని వెంటనే పంటను కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా రైతుకున్న సమస్యను పరిష్కరించడానికి అధికారులు తగిన కృషి చేయాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని, దీనిపై నిత్యం కస్టోడియన్ అధికారులు, ఇతర అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో తరచుగా మిల్లులతోపాటు రైతు సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నామని, రైతుల సహాయార్థం ఇప్పటికే 1967 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రవాణాకు 600 నుంచి 1523 వరకు వాహనాలను పెంచినట్లు కలెక్టర్ తెలిపారు.
జి కొండూరులో పత్తి కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆదుకోవాలని సభ్యులు మంత్రిని కోరగా, ఎన్టీఆర్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కంచికచర్ల జడ్పిటిసి సభ్యులు వేల్పుల ప్రశాంతి మంత్రిని కోరగా, దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయగా, వచ్చే సమావేశం నుంచి అధికారులందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్పర్సన్ తెలిపారు.
బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ తీర ప్రాంతంలోని మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నీటి కొరతను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జల్జీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కృషి కృషి చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో జిల్లాలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బ్యాంకు లింకేజీ పథకాలు అయిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పి ఎం ఈ జి పి), ముద్రా రుణాలు వంటి పథకాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పరిశ్రమల అధికారులకు సూచించారు. దీనిపై త్వరలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామన్నారు.
గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజల శ్రేయస్సుకు కృషిచేసిన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, జాతీయ జండా రూపు శిల్పి పింగళి వెంకయ్య, స్వాతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే విధంగా తమ పరిధిలోని ప్రజలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కే కన్నమ నాయుడు, ఎంపీపీ, జడ్పిటిసి సభ్యులు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.