Breaking News

మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెద్దలందరి సహకారంతో వినూత్న ఆలోచనలతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామంలోనీ జువెలరీ పార్కులో 1.98 కోట్ల రూపాయల పెట్రోనెట్ ఎల్ ఎన్ జి లిమిటెడ్ న్యూఢిల్లీ వారి సిఎస్ఆర్ నిధుల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిలతో కలిసి రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగిపోయిన జువెలరీ పార్కు అభివృద్ధి పనులు పార్లమెంటు సభ్యులు బాలశౌరి చొరవతో జీవం పోసుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. జువెలరీ పరిశ్రమ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం గతంలో మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి సహకారంతో 5 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో పూర్తికాక ఆగిపోయిందన్నారు. ఈ జువెలరీ పార్కును మరల అన్ని విధాల ప్రయోజనకరంగా తీర్చిదిద్ది చిరంజీవితో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రపంచంలో పోటీ తత్వం పెరిగిందని, రాను రాను సాంకేతికత కూడా పెరుగుతోందని, రోజురోజుకు ఆకృతులు మారిపోతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం కూడా సాంకేతికతను అందిపుచ్చుకొని ముందడుగు వేయాలన్నారు.

ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ప్రారంభించామని, అందులో కొబ్బరి నీళ్లను గడ్డకట్టించి కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అలాగే కాఫీలో కూడా వివిధ రకాలు చాలా ఉన్నాయని, ఇటీవల ఎం ఎస్ ఎం ఈ ల ప్రోత్సాహం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తే మొత్తం 600 మంది నమోదు చేసుకున్నారని, అందులో 275 మంది పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రతి నెల 100 మందితో యూనిట్లను నెలకొల్పి శిక్షణ నిచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అలాగే ఎందుకు పనికిరాదని ఇప్పటివరకు అనుకుంటున్న గుర్రపు డెక్కతో చిన్నాపురంలో ఒక వర్క్ షాప్ నిర్వహించి వాటిని ఎండబెట్టి బుట్టలు టోపీలు వివిధ రకాల అల్లకాలను తయారుచేసి మార్కెటింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 25 ఎకరాలను సేకరించి జువెలరీ పార్కు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గోల్డ్ ప్రిన్స్ వారు వెండి, బంగారం కూడా తయారు చేయడం శుభ పరిణామం అన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి కొత్త కొత్త ఆలోచనలు, విధానాలతో వ్యాపారాలు మొదలు పెట్టాలన్నారు. ఆలోచన విధానంలో మార్పు రావాలని, మనం ఎక్కడ ఉన్న అక్కడికి ఆహారం గానీ, వస్తువులు గానీ తీసుకువచ్చే స్విగ్గి ఆలోచన మన జిల్లాకు చెందిన ఉయ్యూరు కుర్రాడిదేనన్నారు. పెద్దలందరి సహకారంతో మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. అన్నాడుతులను ఆదుకోవడానికి తొలి విడతలో ఇప్పటికే ఒక అన్న క్యాంటీన్ ప్రారంభించామని, రెండో విడతలో జువెలరీ పార్క్, బేబీ సెంటర్లలో రెండు చోట్ల అన్న క్యాంటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి జువెలరీ పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకొని 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను తీసుకురావడం అభినందించదగ్గ విషయమన్నారు. చిలకలపూడి బంగారు కవరింగ్ నగలకు ప్రసిద్ధి చెందిందన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో 500 బంగారు కవరింగ్ కంపెనీలు ఉన్నాయని, వీటి ద్వారా వేలాదిమంది ఉద్యోగాలు పొంది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి జువెలరీ పార్కు ట్రేడ్ సెంటర్ కోసం నిధులు మంజూరు చేశారని అయితే ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. మరల ఎంపి బాలశౌరి చొరవతో 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అద్భుతంగా పనులు పూర్తి చేయాలన్నారు.

మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ జువెలరీ పార్క్ అభివృద్ధి కోసం గతంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి కోటి 60 లక్షల రూపాయలను ఇచ్చారని, అనుకున్న విధంగా భవనం పూర్తి గాక ఆగిపోయిందన్నారు. జువెలరీ పార్క్ వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగపడేలా అన్ని విధాల తీర్చిదిద్దుతామన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిని భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. పెదకల్లేపల్లిలో ప్రముఖ రచయిత వేటూరి సుందర రామమూర్తి పేరిట, ఘంటసాల లో వెంకటేశ్వరరావు పేరిట ఒక్కొక్కటి కోటి రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాలను నిర్మించనున్నామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 20 నుంచి 30 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ నుండి తీసుకొని ఒక్కో మహిళకు 20 సెంట్లు చొప్పున పరిశ్రమలు నెలకొల్పుటకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఎం ఎస్ ఎం ఈ రంగంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు చాలాఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పరిశ్రమల శాఖ ద్వారా బ్యాంకుల నుండి రుణాలు పొందే హక్కు ప్రజలకు ఉందనీ తద్వారా పలు రకాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సిజిటిఎంఎస్ అనే కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా మంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఉంటే 5 కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణం కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులకు ఘనంగా సత్కారం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం వెంకటరావు, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ ఈఈ రాయన్న, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీ, గోల్డ్ ప్రిన్స్ నరసింహ రావు, ప్రసాదరావు, గోపు సత్యనారాయణ, మాదివాడ రాము, ఇలియాస్ భాష, తదితర అధికారులు, అనధికారులు, గోల్డ్ కవరింగ్ కంపెనీల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *