విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవలసిన బాధ్యత దేశంలోని వామపక్ష ,ప్రజాతంత్ర శక్తులపై వున్నదని సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఉద్టిటిoచారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మోదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని భట్టాచార్య విమర్శించారు. హామీలు అమలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. హామీల అమలు కోసం అందర్నీ కలుపుకుని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను, దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనాలను, ఉద్యోగ భద్రతను కల్పించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. విద్య ,ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి సంవత్సరం సందర్భంగా దేశంలోనూ ,ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి సిపిఐ ఎం.ఎల్ కృషి చేస్తుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల విలీనం పైన ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దీపాంకర్ భట్టాచార్య సమాధానం ఇస్తూ ఉమ్మడి పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దానిని సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. స్వాతంత్ర్యనంతరం తలసరి ఆదాయం పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అదాని, అంబానీల ఆదాయాలు పెరుగుదలతో పోల్చుకుంటే సామాన్య, మధ్యతరగతి వర్గాల తలసరి ఆదాయం పెరుగుదల శూన్యమని భట్టాచార్య చెప్పారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దీపాంకర్ భట్టాచార్యను శాలువా, జ్ఞాపకతో ఐ.జే.యు జాతీయ సమితి సభ్యులు షేక్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పత్రికల సంఘం నగర అధ్యక్షుడు యమ్.విసుబ్బారావు వందన సమర్పణ చేశారు.
Prajavartha Online Telugu News