-కరెంట్ ఆదా చేద్దాం.. భావితరాలకు భరోసానిద్దాం.
-14 డిసెంబర్ నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్
-ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి
-జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన..
-పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం స్థానిక వై జంక్షన్ లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20 వ తేది వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామని ఇంధన ప్రాముఖ్యతను, ఆదా చేయవలసిన విధానాలను మంత్రి దుర్గేష్ వివరించారు.
ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపు పై అవగాహన తప్పనిసరి అని తెలిపారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడదామని తద్వారా 60 శాతం కు పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. నేటి సత్సంకల్పమే రేపటి వెలుగుల సహకారం అని పేర్కొన్నారు.. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా చేయవచ్చని సూచించారు.. అంతేగాక కరెంటును ఆదా చేస్తే భావితరాలకు భరోసానిచ్చిన వారవుతామని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంధనం పొదుపు వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోల్ విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. క్రమంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూనే సౌర శక్తిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకొని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధనం పొదుపు విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ఇంధన పొదుపు మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్నటి రోజున కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో విజన్ @ 2047 కార్యచరణ అమలులో భాగంగా పది సూత్రాల అంశాలను చక్కగా అర్థమయ్యే విధంగా విశిదీకరించడం జరిగిందన్నారు. అందులో ఇంధనం పొదుపు కూడా ఒక భాగముగా ఉందన్నారు. భవిష్యత్తు అభివృద్ధిలో విద్యుత్ చాలా అవసరమని దానిని పొదుపు చేయడం ద్వారా అధిగమించవచ్చన్నారు. ఒక యూనిట్ విద్యుత్తును ఆదా చేయటం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు. అదేవిధంగా విద్యుత్ సంబంధిత బల్బులు ఇతర పరికరాలు కొనుగోలు సమయంలో తక్కువ విద్యుత్తును వినియోగించేలా చేస్తే విద్యుత్ ఆదా పెరుగుతుందన్నారు. వ్యవసాయ, గృహ అవసరాలకు సంబంధించి సోలార్ విధానాన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా ప్రమోట్ చేస్తున్నామని తద్వారా విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలన్నారు. ఇంధనం పొదుపు వలన భవిష్యత్తు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ భావితరాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును ఆదా చేసి పునాదులు వేద్దాం అన్నారు. సాంప్రదాయ బల్బులు స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడి నేటి సత్ సంకల్పం రేపటి వెలుగులకు సహకారం చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఏపీ ఈపిఎంఇ ..ఎస్ఈ కే. తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్. సామ్యూల్, వై. డేవిడ్, వై. నారాయణ అప్పారావు, డి.శ్రీధర్ వర్మ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News