మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ ఉప కులాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సి ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి కృష్ణ జిల్లా అధికారులను కోరారు. ఏకసభ్య కమిషన్ ఉమ్మడి కృష్ణజిల్లా పర్యటలో భాగంగా కృష్ణజిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఉమ్మడి జిల్లాలో భాగమైన కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఎస్సీలలోని ఉపకులాల వారిగా జనాభా, వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉమ్మడి కృష్ణజిల్లాకు సంబంధించి 2011 జనాభా గణన ఆధారంగా ఎస్సీ ప్రజల గణాంకాలను ఏక సభ్య కమీషన్ చైర్మన్ కు వివరించారు. 2011 జనాభా గణాంకాల ప్రకారం ఉమ్మడి కృష్ణ జిల్లాలో మొత్తం జనాభా 45.17 లక్షల మంది ఉండగా, ఎస్సి జనాభాలో 51 ఉప కులాలు, వీరిలో ప్రధానంగా మాదిగ జనాభా 4,44,734 మంది, మాల జనాభా 3,89,665 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. అనంతరం ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ఫ్రభుత్వం ఎస్సి ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమీషన్ ను ఏర్పాటు చేసిందని, 2011 జనాభా ఆధారంగా పూర్వ 13 జిల్లాల స్థాయిలో ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమతమ శాఖలలో పనిచేస్తున్న ఎస్సి ఉద్యోగల వివరాలను, కాడర్, ఉపకులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలతో కూడిన సమాచారం తమకు సమర్పించాలని కోరారు. జిల్లా పరిషత్ సీఈవో, డిపీవో, డిఆర్డిఏ, మున్సిపాలిటీ, ఆర్టిసి తదితర శాఖలలో ఉప కులాల వారి డేటా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఉపకులాల వారీగా లబ్ధిదారుల డేటా సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ గంగాధర్ రావు, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, జెడ్పి సీఈవో కే కన్నమ నాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు షేక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమావేశం అనంతరం జడ్పీ కన్వెన్షన్ హాలులో ఏకసభ్య కమీషన్ చైర్మన్ వివిధ ఎస్సి ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞాపనలను స్వీకరించారు.
Prajavartha Online Telugu News