విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతోపాటు ప్రతీ కాలనీలో మౌలిక సదుపాయాలు ముందుగానే కల్పిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు. గురువారం నగరంలోని రైతు శిక్షణా కేంద్రంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షలమందికి ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ జిల్లాలో పర్యటించి సమీక్షిస్తున్నామన్నారు. క్రొత్తగా 17 వేల కాలనీల్లో అండర్ గ్రౌండు వాటర్ , కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ మోడరన్ కాలనీలుగా జగనన్న ఇళ్లకాలనీలను నిలుపుతామన్నారు. డ్రెయినేజీలు, త్రాగునీటి వసతులు ముందుగా కల్పిస్తున్నామన్నారు. ఆయా లేఅవుట్ల సైజునుబట్టి 20 వేల నుంచి లక్ష లీటర్ల సామర్ధ్యం గల ఓహెచ్ యస్ఆర్లను నిర్మిస్తున్నామన్నారు. లబ్దిదారులు తమ స్టోమతనుబట్టి అదనపు గదులు కట్టుకుంటామన్నా అనుమతిస్తామన్నారు. వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి 30 వేల ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న లేఅవుట్ కు కూడా ఇసుక అందిస్తున్నామన్నారు. రోడ్లు, నీరు అన్నీ ఇచ్చి ఇళ్లు కట్టుకోవాలని ప్రోత్సహిస్తున్నామన్నారు. దూరంగా ఉన్న లేఅవుట్ విషయంలో మరింత ఎక్కువ దృష్టి పెట్టి నిర్మాణాలుత్వరగా పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, తదితరులు పాల్గొన్నారు.
