Breaking News

29, 30, 31 వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే  మల్లాది విష్ణు…

-ఈబీసీ నేస్తం పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి…
-మహిళ సంరక్షణ కార్యదర్శి సేవలను విస్తరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సేవలు సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. మారుతీనగర్ లోని 29, 30, 31 వార్డు సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  మాట్లాడుతూ గడపగడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన వార్డు సచివాలయ వ్యవస్థ లక్ష సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క సెంట్రల్ లోనే 1,344 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీరంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సంక్షేమ క్యాలెండర్ పై ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచాలన్నారు. అనంతరం డివిజన్ లో సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నారు. ఏదైనా సమస్యతో సచివాలయానికి వచ్చేవారు ఎవరూ కూడా నిరుత్సాహంతో వెనుదిరగే పరిస్థితి ఉండకూడదన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరియు శానిటేషన్ సిబ్బంది పనితీరుపై ఎప్పటిప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

మహిళల భద్రతకు భరోసా…
మహిళా సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మల్లాది విష్ణు  అన్నారు. ఇందులో భాగంగా ప్రతి వార్డు సచివాలయంలో ఒక మహిళ సంరక్షణ కార్యదర్శిని నియమించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ ప్రతినిధిగా మహిళా పోలీస్ లు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి సేవలను మరింత విస్తృత పరచాలన్నారు. తమ పరిధిలోని విద్యార్థినులు, ఉద్యోగస్తులు, గృహిణిలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలన్నారు. వారికి నిత్యం అందుబాటులో ఉండే విధంగా.. ప్రధాన కూడళ్ల వద్ద ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. ఆకతాయిలు, మందుబాబులు సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క మహిళ దిశా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ప్రముఖ పాత్రను పోషించాలని మహిళ సంరక్షణ కార్యదర్శులకు సూచించారు.

ఈబీసీ నేస్తంపై విస్తృత అవగాహన కల్పించాలి…
ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించనున్నట్లు మల్లాది విష్ణు  వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకంపై ఇప్పటినుంచే సచివాలయ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలన్నారు. డివిజన్ లోని అగ్రవర్ణ పేదలకు ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈబీసీ సర్టిఫికెట్, ఇన్ కం సర్టిఫికెట్ల జారీలో వీఆర్వోలు చురుకుగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

కాపు నేస్తం దరఖాస్తుకు నెల రోజుల గడువు పొడిగింపు…
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చేతులమీదుగా గురువారం ప్రారంభమైన కాపునేస్తం పథకానికి విశేష స్పందన లభించిందని మల్లాది విష్ణు  అన్నారు. ఈ పథకం ద్వారా విజయవాడ నగరంలోని 6,214 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు రూ. 8 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 2,153 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. అర్హత ఉండి కూడా పథకానికి ఎంపిక కాని వారి కోసం మరోనెల రోజుల పాటు గడువును పొడిగించినట్లు మల్లాది విష్ణు  వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Check Also

కార్యకర్తలకు అండగా టీడీపీ జెండా

–పెళ్ళిఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందచేసిన గద్దె క్రాంతి కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *