విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపండి…


-ఢిల్లీలో ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు  వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని అన్నారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి ఆయన సమర్పించిన వినతి పత్రంలో వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *