-చంద్రబాబు సంస్కరణలతోనే విద్యుత్ రంగంలో పెట్టుబడులు
-విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సమస్య పరిష్కారానికి చర్యలు
-8 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం
-రాజకీయ మనుగడ కోసమే కొందరు అసత్య ప్రచారాలు
– ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ డైరీ ఆవిష్కరణలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి: విజయవాడ వరదలతో పాటు అనేక ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ రంగ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడలోని సుజనా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సంస్కరణలోనే విద్యుత్ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అనేక ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థలకు ధీటుగా ఏపీ విద్యుత్ రంగ ఉద్యోగులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. విద్యుత్ రంగం అంటే వ్యాపార రంగం కాదు.., సేవా రంగమని తెలిపారు. ఈ శాఖకు మంత్రిగా ఉన్నందుకు తనకు ఎంతో గర్వపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏటా విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని… దీనితో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అయినా లైన్ మెన్ నుంచి ఏఈ, ఆ పై అధికారుల వరకూ 24 గంటలూ పని చేస్తూ.. రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తూ.. తమ చిత్తశుద్ధిని చాటుతున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఇంత కష్టపడుతున్నా… రాజకీయ అస్థిత్వం కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఉండవు అని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించినా… ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు.
ఔదార్యంలోనూ మేటి….
మిగిలిన అన్ని రంగాలకూ భిన్నంగా విద్యుత్ రంగ ఉద్యోగులు ఒడుదొడుకులు, ఒత్తిడిలు మధ్య తమ అత్యవసర విధులను నిర్వహిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజయవాడ బుడమేరు వరదలు వచ్చినప్పుడు.. అందరికంటే ముందుగా ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ప్రకటించి… విద్యుత్ ఉద్యోగులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోనున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామన్నారు. సీఎం దావోస్ పర్యటనతో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో విద్యుత్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని.., ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి.. ప్రజలపై పెను భారాలు వేసిందని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏపీ విద్యుత్ రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ఉద్యోగులతో పాటు అందరం కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉద్యోగులకు అందుబాటులో ఉంటా…
ఉద్యోగులు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు చూస్తుంటే నాపై మరింత బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అవసరం అయితే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో… నేడు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగులకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్ కో ఎండీ కీర్తి చేకూరి, ఏపీఎస్ఈబీ నాయకులు శామ్యూల్, నాగప్రసాద్, రామారావు, గోపాలకృష్ణ, శైలేంద్ర, ఇంజనీర్లు, తదితరలు పాల్గొన్నారు.