-చంద్రబాబు నాయుడు ఆలోచనకు రూపమే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్
-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరిన్ని ప్లాంట్లు రావాలి
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లును ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గుంటూరు లోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మంగళవారం సందర్శించారు. చెత్తను ప్రాసెసింగ్ చేసి, విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియను అక్కడి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… గుంటూరు జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ లో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని మూడు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించి శుభ్రం చేయడంతో పాటు గంటకు 15 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. పర్యావరణహితం కోసం ఇలాంటి ప్లాంట్లు మరిన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి రావాలన్నారు. నాడు చంద్రబాబు దూరదృష్టితోనే ఏపీకి జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వచ్చిందని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. దేశం వ్యాప్తంగా చూస్తే దేశ రాజధాని దిల్లీ తరువాత ఇలాంటి ప్లాంట్లు కేవలం ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో చెత్త సేకరణ సరిగా జరగలేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. అంతేగాకుండా నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెత్త మీద కూడా పన్ను వేశారని గుర్తు చేశారు. సంపద సృష్టించాలంటే పన్నుల రూపంలో వసూలు చేయడం మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసి కూడా సృష్టించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిందాల్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎంవీ చారీ ఇతర అధికారులు పాల్గొన్నారు.