మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన చెత్త వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో తరచుగా చెత్త వేసే ప్రదేశాలు గుర్తించి శుభ్రం చేసి అక్కడ పూల కుండీలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా చెత్త వేసే వారిని గుర్తించేందుకు అవసరమైతే ఆయా ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఉన్న ప్రతి దుకాణదారుడు విధిగా వారి షాపు ముందు చెత్తకుండీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా చెత్తను బయట వేస్తే జరిమానా విధించాలన్నారు. కోనేరు సెంటర్లో బాదంపాలు అమ్మే బండ్ల దగ్గర చెత్త పడవేస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. సేకరించిన పొడి చెత్తను మాత్రమే కొండవీడు జిందాల్ పరిశ్రమకు తరలించాలన్నారు. ఈ క్రమంలో దావులూరు టోల్గేట్ వద్ద చెత్త వాహనాలకు టోల్ వసూలు చేస్తున్నారని కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయన జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. నగరంలోని ప్రధాన రహదారుల డివైడర్లకు నామమాత్రంగా కాకుండా ఆకర్షణీయమైన డిజైన్లతో రంగులు వేయించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, నోడల్ అధికారులు జెడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద తదితరులు పాల్గొన్నారు.
