గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గుడివాడ డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లకు కార్యశాల నిర్వహించి రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లు రీ సర్వే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా రీ సర్వే చేయాలన్నారు. సమస్యలు గల భూముల విషయంలో జాగ్రత్త వహించాలని, అనుభవదారులు హక్కుదారులు, ప్రైవేటు ప్రభుత్వ భూములు, భూ సేకరణ భూములు గుర్తించి నమోదు చేయడంలో క్షుణ్ణంగా పరిశీలించాలాన్నారు.రికార్డుల ప్రకారం సక్రమంగా ఉంటూ భూ యజమానులు లేదా రైతులకు సంబంధించిన భూ విస్తీర్ణం, భూ సరిహద్దులు వంటి వివాదాలు పరిష్కరించే క్రమంలో ఇరువురికి సమ్మతంగా ఉంటే సాధ్యమైనంతవరకు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే సమయంలో భూమికి సంబంధించిన వ్యక్తులు స్వగ్రామంలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నట్లయితే వారికి తప్పనిసరిగా సమాచారం అందించి పిలిపించాలని, ఇతర దేశాలలో నివసిస్తున్న వారి విషయంలో వారు సూచించిన వ్యక్తుల సమక్షంలో రీ సర్వే చేయాలన్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియలు సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రీ సర్వేకు సంబంధించిన హ్యాండ్ బుక్ ను సమగ్రంగా చదివి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియ ప్రారంభించేముందు అందుకు సంబంధించిన వివరాలతో ఆయా గ్రామాలలో గ్రామసభతో పాటు ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో పాటు ఆయా గ్రామాలలోని భూ యజమానులు రైతులతో కూడిన ఫోన్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏ రోజున ఏ సర్వే నంబర్లు రీ సర్వే చేస్తున్నదీ సమాచారం అందించాలని సూచించారు. అనంతరం వారు రీ సర్వే ప్రక్రియపై రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ రావు, కే ఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, గుడివాడ ఆర్టీవో జి బాలసుబ్రమణ్యం, తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
