అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతలు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో భేటీ అయ్యారు. సచివాలయంలో బుధవారం జరిగిన వీరి భేటీలో పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సచివాలయాల పరిధిలో ఉన్న సుమారు 7,400 మంది గ్రేడ్ 2 జూనియర్ లైన్ మెన్ లను విద్యుత్ శాఖలో విలీనం చేయడంతో పాటు నాలుగు డిస్క్ంలను ట్రాన్స్ కో పరిధిలోకి తీసుకు రావాలని సంఘం నేతలు కోరారు. అదే విధంగా విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాఖాపరంగానే జీతాలు అందించాలని విన్నవించారు. పని ఒత్తిడిని అధిగమించే విధంగా ఉద్యోగులకు విధులు కేటాయింపు జరగాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధుల నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు గత ప్రభుత్వం చెల్లించిన రూ.25,000 కోట్లను కూడా తిరిగి సంస్థలో జమ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీటితో పాటు కొన్ని శాఖాపరమైన సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగునాడు కార్మిక సంఘం నేతల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి… సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని కార్మిక సంఘం నేతలకు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు తుఫానులు, వరదలు., ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో వెలకట్టలేని సేవలు చేశారని వారిని అభినందించారు. అదే విధంగా గత ఎన్నికల సమయంలోనూ విద్యుత్ శాఖ ఉద్యోగులు మంచిగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పర్యతనేని సాంబశివరావు, ఎమ్.శ్రీరామమూర్తి, వెంకటేశ్వరరావు పలువురు నేతలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి గొట్టిపాటిని కలిసిన ఆక్వా రైతులు…
అధిక లోడ్ తో పాటు ట్రాన్స్ ఫార్మర్ రుసుములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు ఆక్వా రైతులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను బుధవారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి… వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి… ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కామిరెడ్డి ఈశ్వరరావు, డీవీవీఎస్ చౌదరితో పాటు పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు.