-ఆర్దికేతర ఫిర్యాదులు,అర్జీలను వెంటనే పరిష్కరించాలి
-ఫిర్యాదులు ఏవిధంగా పరిష్కరిస్తుందీ ర్యాండమ్ చెకింగ్ నిర్వహిస్తాం
-ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో కలక్టర్ల సమావేశం
-అన్నిశాఖల కార్యక్రమాలు,పధకాలపై కార్యదర్శులు కలక్టర్లకు అవగాహన కల్పించాలి
-2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేయాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజల నుండి వచ్చే వివిధ ఫిర్యాదులు,అర్జీలను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులు, శాఖాధిపతులు,జిల్లా కలక్టర్లను ఆదేశించారు.జిఎస్డిపి,కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు,కలెక్టర్ల సమావేశం,గ్రీవియెన్స్ రిడ్రస్సల్,కుల ఘణనపై సోషల్ ఆడిట్, ప్రభుత్వ ప్రధకాలు,ప్రాజెక్టులపై కార్యదర్శుల ద్వారా కలక్టర్లకు పూర్తి అవగాహన కల్పించడం వంటి అంశాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా ముందుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి సిఎస్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను నిర్ధిష్ట వ్యవధిలోగా హేతుబద్ధంగా సక్రమంగా పరిష్కరించాలని కార్యదర్శులు,శాఖాధిపతులు,కలక్టర్లకు స్పష్టం చేశారు.ఆర్దికేతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ప్రతి శాఖ తరపున ఒక నోడలు అధికారిని నియమించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను ఏవిధంగా పరిష్కరిస్తుందీ అక్కడక్కడా శాంపిల్ తనిఖీలు చేయడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో కలక్టర్ల సమావేశం
ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో కలక్టర్ల సమావేశం జరిగే అవకాశం ఉందని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.కలక్టర్ల సమావేశానికి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు,పధకాలకు చెందిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని కలక్టర్ల సమావేశానికి వారం రోజులు ముందుగానే జిల్లా కలక్టర్లకు అందించాలని కార్యదర్శులను ఆదేశించారు.వివిధ శాఖల్లో అమలయ్యే పధకాలు,కార్యక్రమాలపై అధ్యయనం చేసి పూర్తి అవగాహనతో జిల్లా కలక్టర్లు కలక్టర్ల సమావేశానికి హాజరై చర్చించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.ఇందుకు సంబంధించి సిసిఎల్ఏ వివిధ శాఖల కార్యదర్శుల నుండి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి కలక్టర్లకు అందించాలని చెప్పారు.ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా రాష్ట్ర,జిల్లా అధికార యంత్రాంగమంతా మరింత సమర్థవంతంగా,వేగవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ కార్యదర్శులకు స్పష్టం చేశారు.
స్వర్ణ ఆంధ్ర 2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అందరూ పనిచేయాలి
రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ లో భాగంగా 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికా శాఖ శాఖల వారీగా, సెక్టార్ల వారీగా,జిల్లాల వారీగా డేటాను సిద్దం చేయడం జరిగిందని ఆడేటా అంతటినీ కార్యదర్శులు,కలక్టర్లకు పంపండం జరుగుతుందని తెలిపారు.సుమారు 525 కీ ఫర్పార్మెన్స్ ఇండికేటర్లను గుర్తించడం జరిగిందని వాటి పూర్తి లక్ష్య సాధనకు ఆయా శాఖలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఎస్సి కేటగిరైజేషన్ పై ఏకసభ్య కమీషన్ కు ఈనెల 27లోగా పూర్తి వివరాలందించండి
ఎస్సి కేటగిరైజేషన్ కు సంబంధించి ఏక సభ్య కమీషన్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నందున అందుకు సంబంధించి అన్ని శాఖల పూర్తి వివరాలను ఈనెల 27వ తేదీ లోగా సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అందజేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
ప్రభుత్వ పధకాలు,కార్యక్రమాలపై కార్యదర్శుల ద్వారా కలక్టర్లకు అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు,పధకాలు, వినూత్న పధకాలపై జిల్లా కలక్టర్లకు పూర్తి అవగాహన ఉండేందుకు వీలుగా ప్రతి శనివారం రెండేసి శాఖల కార్యదర్శులు వారి శాఖలకు సంబంధించిన పధకాలు,కార్యక్రమాలపై కలక్టర్లకు వర్చువల్ విధానంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ చెప్పారు.ఇందుకు సంబంధించి 11 వారాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ ను రూపొందించామని దీనిపై తగిన సూచనలు,సలహాలు ఇస్తే వాటిని పరిశీలించి తుది షెడ్యూల్ ను రూపొందించి తెలియజేస్తామని అన్నారు.ఒక సైకిల్ పూర్తయ్యాక మరో సైకిల్ షెడ్యూల్ ను సిద్దం చేయడం జరుగుతుందని చెప్పారు.ఏ శాఖల్లో ఏఏ కార్యక్రమాలు, పధకాలు అమలవుతుందీ కలక్టర్లు,జెసిలు తదితర అధికారులకు పూర్తి అవగాహన ఉంటే ఆయా పధకాలు,కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలయ్యేందుకు కలక్టర్లు జిల్లా స్థాయిలో ఆయా శాఖాలకు మార్గదర్శనం చేసేందుకు వీలవుంతుందని సిఎస్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మి, సియం కార్యదర్శి ప్రద్యుమ్న,ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,కార్యదర్శులు కన్నబాబు,యంయం నాయక్,సిడిఎంఏ హరి నారాయణ,ఆర్టీజిఎస్ సిఇఓ దినేష్ కుమార్,సోషల్ వెల్పేర్ డైరక్టర్ లావణ్య వేణి,ప్రణాళిక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.